Communist Parties on Telangana Assembly Elections 2023 : వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఒక్కటిగా ఉండాలని, ఒకే పార్టీతో పొత్తు కుదుర్చుకోవాలని సీపీఐ, సీపీఎంలు నిర్ణయించాయి. గతంలో మాదిరిగా వేరు వేరుగా ఎన్నికల్లో పోటీ చేయకూడదని.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో పొత్తుపై అనుసరించాల్సిన వ్యూహంపై ఇరు పార్టీల కీలక నేతలు సుదీర్ఘంగా చర్చించారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూం భవన్‌లో నిర్వహించిన సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఇతర నేతలు పాల్గొన్నారు. 2 గంటలకుపైగా జరిగిన సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి ఉండటంతో పాటు బీఆర్‌ఎస్‌తో పొత్తు ఇరు పార్టీలకు గౌరవప్రదంగా, ఉపయోగకరంగా ఉండాలని అంచనాకు వచ్చారు.
CPI and CPM contest together in TS Assembly Elections 2023 : సీపీఎం, సీపీఐ పోటీ చేసే స్థానాలపై చర్చించేందుకు రెండు వారాల్లో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. వామపక్షాలతో పొత్తుల అంశంపై బీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇటీవల చేసిన వ్యాఖ్యలు సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. కొందరు బీఆర్‌ఎస్ నేతలు పొత్తులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. అది సరైంది కాదని అభిప్రాయపడినట్లు సమాచారం. వామపక్షాలు కలిసి బలంగా ఉండాలని. బీఆర్‌ఎస్‌తో పొత్తుపై.. సందర్భం వచ్చినప్పుడు మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
సీపీఎంకు 3, సీపీఐకి 3 సీట్లు..!: కమ్యూనిస్టు పార్టీలకు బలం ఉన్న ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో పోటీ చేసేందుకు నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే సీపీఎం నల్గొండ, ఖమ్మంతో పాటు రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం కలిపి మొత్తం 12 స్థానాలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. ఒకవేళ పొత్తు కుదరని పక్షంలో ఈ స్థానాల్లో సీపీఐతో కలిసి పోటీ చేయాలని భావిస్తోంది. బీఆర్‌ఎస్‌తో అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు కొనసాగితే.. సీపీఎంకు 3, సీపీఐకి 3 అసెంబ్లీ సీట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. సీపీఎంకు ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, పాలేరు, నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ, సీపీఐకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా, కొత్తగూడెం, నల్గొండ జిల్లాలోని దేవరకొండ లేదా మునుగోడు స్థానాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చాడ వెంకట్‌రెడ్డికి ఎమ్మెల్సీ..!: హుస్నాబాద్ సీటు కూడా సీపీఐకి కేటాయించాలని ప్రతిపాదన ఉన్నప్పటికీ.. అక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్న చాడ వెంకట్‌రెడ్డికి.. మార్చిలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీల్లో ఒకటి ఇచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా నడుస్తోంది. సీపీఎం, సీపీఐ రాష్ట్ర నాయకత్వాలు మాత్రం బీఆర్‌ఎస్‌తో సీట్లపైన ఎలాంటి చర్చలు జరపలేదని తెలిపారు. మరో వారం, పది రోజుల్లో సమావేశమై సమాలోచనలు జరిపే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
రాష్ట్రంలో బీజేపీని ఎదగనీయకుండా చేయాలనే లక్ష్యంతో మునుగోడులో బీఆర్‌ఎస్‌తో కలిసిన కమ్యూనిస్టులు.. అదే అజెండాగా కలిసి సాగాలని భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీఆర్‌ఎస్ నుంచి వచ్చే స్పందనకు అనుగుణంగా ముందుకు సాగాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఇవీ చూడండి..