పండ్ల మార్కెట్ తరలింపుపై కొంతకాలంగా పడుతున్న తర్జనలు భర్జనలకు ఎట్టకేలకు తెరపడింది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్(Gaddiannaram Fruit market news) తరలింపునకు తేదీ ఖరారైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నీతానై అందరితో సంప్రదింపులు జరిపి.. మార్గం సుగమం చేశారు. గడ్డిఅన్నారం తరలింపు అంశం సంబంధించి ప్రత్యామ్నాయాలపై కసరత్తులో భాగంగా కొత్తపేటలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీతో కలిసి నిరంజన్‌రెడ్డి విక్టోరియా మెమోరిల్ మైదానం పరిశీలించారు. అనంతరం... మంత్రులు బాటసింగారం లాజిస్టిక్స్ పార్కు(Batasingaram logistics park news) సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన లక్ష చదరపు అడుగుల 3 గోదాములు, అంతర్గ రోడ్లు, పార్కింగ్, ఇతర మౌలిక సదుపాయాలు కలియ తిరిగి పరిశీలించారు.
హర్షాతిరేకాలు
ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, బలాల, కిషన్‌రెడ్డి, మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీబాయితో... ప్రత్యేకంగా మంత్రులు సంప్రదింపులు చేశారు. కమీషన్ ఏజెంట్లు, వర్తక సంఘాల ప్రతినిధులతో మాట్లాడి.. తమ అభిప్రాయాలు స్వీకరించారు. కమీషన్ ఏజెంట్లు ప్రస్తావించిన సందేహాలను నివృత్తి చేయడమే కాకుండా... మంత్రులు భరోసా ఇచ్చారు. దసరా వేళ బాటసింగారం లాజిస్టిక్స్ పార్కులో తాత్కాలిక మార్కెట్ కార్యకలాపాలు మొదలుపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక అదే రోజు కోహెడలో లైసెన్స్ కలిగి ఉన్న వ్యాపారులకు స్థలాలు కేటాయించి అప్పగిస్తామని మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించడంతో.. వ్యాపార వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
ప్రతిఒక్కరూ కూడా రోడ్లమీద వ్యాపారాలు చేసుకుంటూ చెట్టుకొకరు, పుట్టకొకరు అన్నసామెతలాగా అక్కడొకరు, ఇక్కడొకరు చేస్తున్నారు. కాబట్టి వీటన్నింటికీ తెర దించుతూ విజయదశమి రోజు అందరం కష్టాలైనా, నష్టాలైనా, లాభాలైనా అందరం ఒకేదగ్గర ఉండి దీన్ని ఎదుర్కొవాలని నిర్ణయం తీసుకొని విజయదశమి రోజు మా వ్యాపారం ప్రారంభించాలని మేము నిర్ణయం తీసుకున్నాం.
-వెలది పురుషోత్తమరావు, దేవీ ఫ్రూట్ మార్కెట్ యజమాని
శుభపరిణామం
బాటసింగారం లాజిస్టిక్స్ పార్కుకు తరలిరావడానికి అధిక శాతం వర్తకులు అంగీకరించిన దృష్ట్యా అవసరమైన సంపూర్ణ మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు మార్కెటింగ్ శాఖ చర్యలకు ఉపక్రమించింది. ఇక గడ్డిఅన్నారంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కోసం.. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు. ఈ నెల 18న హైకోర్టులో(ts high court news) విచారణ ఉన్నందున.. ఈ లోగా కేసు ఉపసంహరించుకుని వ్యాపారులు సహరించేందుకు సిద్ధం కావడం శుభపరిణామం అని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు.
కేసులన్నీ విత్‌డ్రా చేసుకోవాలి. తాత్కాలికంగా ఇక్కడికి తరలిరావాలి. ఇక్కడికి వచ్చాక ఎవరైతే లైసెన్స్ వ్యాపారలు ఉన్నారో వాళ్లందరికీ కొహెడలో భూములు అలాట్ చేస్తాం. దాని తర్వాత షెడ్ల కార్యక్రమం ప్రారంభిస్తాం.
-ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
ఏజెంట్లలో ఆత్మస్థైర్యం..
బాటసింగారంలో జరిగిన సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు, సానుకూలతలు వంటి అంశాలను... క్షుణ్ణంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన మంత్రి నిరంజన్‌రెడ్డి.. కమీషన్ ఏజెంట్లలో ఆత్మస్థైర్యం నింపారు.
ఇదీ చదవండి: Azadi Ka Amrit Mahotsav: గాంధీ గూగ్లీకి ఆ ఐపీఎల్ క్లీన్‌బౌల్డ్