రాష్ట్ర సచివాలయ భద్రతకు సుశిక్షితులను నియమించే దిశగా పోలీస్ శాఖ యోచిస్తోంది. ఎలాంటి అనూహ్య సంఘటననైనా దీటుగా ఎదుర్కొనేందుకు సాయుధ భద్రతాదళాన్ని సిద్ధం చేసే ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) సిబ్బంది ఆ బాధ్యత నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. వారిలోనుంచే మెరికల్లాంటి సిబ్బందిని ఎంపిక చేసి కమెండో తరహా శిక్షణ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అసాంఘికశక్తుల దాడుల్ని సమర్థంగా తిప్పికొట్టడంలో నిష్ణాతులుగా పేరున్న ఆక్టోపస్, గ్రేహౌండ్స్‌ల మాదిరి సుశిక్షితులుగా తయారు చేయాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. ఎంపిక చేసిన సిబ్బందికి నార్సింగిలోని గ్రేహౌండ్స్, ఇబ్రహీంపట్నంలోని ఆక్టోపస్ క్యాంపస్‌ల్లో శిక్షణ ఇప్పించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం సచివాలయంగా కొనసాగుతున్న బీఆర్‌కే భవన్‌కూ ఆ తరహా సాయుధ శిక్షణ సిబ్బందిని నియమించే దిశగా ప్రస్తుతం పోలీస్ ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే దిల్లీలో ఎర్రకోటపై జరిగిన దాడి నేపథ్యంలో ఈ దిశగా కార్యాచరణ రూపొందుతుండటం ప్రాధాన్యం సంతరించుకొంది.
ఇదీ చదవండి: కొవిడ్ టీకాపై సంకోచమే అసలు సమస్య