Cold Effect on Telangana : రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను పొగమంచు కమ్మేస్తోంది. ప్రజలను చలి వణికిస్తోంది. ఈశాన్య భారతం నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణలో గాలులు వీస్తున్నందున రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. రాత్రివేళల్లో అయితే చలికి రోడ్లపై జనసంచారం తగ్గింది. బస్టాండ్లు, ఫుట్‌పాత్‌లపై జీవనం సాగించే అభాగ్యుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
రాష్ట్రంలో ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. మరికొందరు చలిమంటలు వేసుకుంటున్నారు. ఉదయం 8 గంటలతర్వాత పొగమంచు కొనసాగుతోంది. వచ్చే మూడురోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3నుంచి 5డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణం ఒక్కసారిగా మారడంతో....సీజనల్ వ్యాధులు విజృంభించే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా ముఖానికి మంకీ క్యాప్, మఫ్లర్ వంటివి ధరించాలని సూచిస్తున్నారు.
ఆదివారం తెల్లవారుజామున రాష్ట్రంలోకెల్లా అత్యల్పంగా కుమురం భీం జిల్లా సిర్పూరు(యు)లో 4.7, హైదరాబాద్ నగరంలోని వెస్ట్‌మారేడ్‌పల్లిలో 10.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. శనివారం ఉదయం హైదరాబాద్ నగరంలో అత్యల్పంగా 18.6 డిగ్రీలు ఉంటే 24 గంటల వ్యవధిలో 10.5 డిగ్రీలకు తగ్గడం గమనార్హం. ఒక్కరోజులోనే 8 డిగ్రీలు తగ్గడంతో చలి బాగా పెరిగింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ను చలి వణికిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ఆ రాష్ట్రంలోనే అత్యల్పంగా 1.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.