నూతన సచివాలయ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాంగణ ప్రవేశప్రదేశంలో గేటు నిర్మించే ప్రాంతాన్ని చూశారు. నిర్మాణ ప్రణాళికను పరిశీలించారు. ఎక్కడ ఏమేమి? వస్తున్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ ప్రాంతంలో సుమారు అరగంట పాటు కలియతిరిగారు. నిర్మాణ ప్రణాళికలో ఎక్కడ ఏమేమి ప్రతిపాదించారో వాటిలో ఎలాంటి మార్పులు ఉండకూడదని స్పష్టం చేశారు.
ఎక్కడ తేడా రాకూడదు
అంచనా వేసినంత వేగంగా పనులు జరగడం లేదన్న సీఎం... నిర్మాణానికి అవసరమైన వాటిని ముందుగా సమీకరించుకోవాలని తెలిపారు. నిర్మాణ నాణ్యతలో ఎక్కడ తేడా రాకూడదని కేసీఆర్ స్పష్టం చేశారు. పునాదులు తీసే క్రమంలో బండరాళ్లు రావటం వల్లే పనులు నెమ్మదిగా సాగుతున్నాయని నిర్మాణ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. పనుల వేగాన్ని పెంచుతామని వారు వివరించారు.రిపబ్లిక్ డే వేడుకలు ముగియగానే ప్రగతిభవన్‌కురావాల్సిందిగా సీఎం కార్యాలయం నుంచి ఆర్‌అండ్ బి అధికారులకు వర్తమానం అందింది.
మైనార్టీల పెద్దలతో సమావేశం
దీంతో వారు ఉరుకులు పరుగులపై అక్కడికి చేరుకున్నారు. సచివాలయ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయని వారిని ఆడిగి తెలుసుకున్నారు. మసీదు లేక పోవటంతో ప్రార్ధనలు చేసుకోవటానికి ఇబ్బందవుతోందని ఇటీవల పలువురు నిరసన వ్యక్తం చేయటం పైనా అధికారులను ప్రశ్నించారు. వారి సమస్య ఏంటో తెలుసుకుని తక్షణం ఏం చేయాలో చూడాలని ఆదేశించారు. అంతటితో సమావేశం పూర్తయిందనుకుని వెళ్లేందుకు ఆధికారులు సిద్ధమవుతుండగా సచివాలయ ప్రాంగణానికి వెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలిద్దామని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు తెలిపారు. ఇలా ఆకస్మికంగా నిర్మాణ పనులు పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు మైనార్టీల పెద్దలతో సమావేశం నిర్వహించాలన్న సీఎం ఆదేశాలతో ఇవాళ మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో భేటీ జరగనుంది.
ఇదీ చదవండి: అరవై ఏళ్ల అన్యోన్య బంధం.. ఒకేసారి ముగిసిన జీవిత ప్రయాణం