CM Revanth Reddy Meeting on Power Department : రాష్ట్రంలోని 4 విద్యుత్ సంస్థల అప్పులు, నష్టాలపై ఆ శాఖ ఉన్నతాధికారులు, సీఎం రేవంత్‌రెడ్డి జరిపిన అంతర్గత సమీక్షలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. తెలంగాణలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థలు డిస్కంలు కరెంట్ సరఫరా సంస్థ ట్రాన్స్‌కో, విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్‌కోతో కలిపి మొత్తం 4 సంస్థలకున్న అప్పులు తెలంగాణ ఏర్పడిన 2014-15 నాటికి రూ.22,423 కోట్ల ఉంటే, ఇప్పుడు రూ.81,516 కోట్లకు చేరాయి.
వీటిలో విద్యుత్ కొనుగోలు చేసినందుకు బిల్లుల చెల్లింపుల కోసం డిస్కంలు తీసుకున్న స్వల్పకాలిక రుణాలే రూ.30,406 కోట్లుగా ఉన్నాయి. ఈ స్వల్పకాలిక రుణాల వల్ల నెలకు వడ్డీల రూపేణా రూ.1000 కోట్ల అదనపు భారం పడుతోంది. ప్రస్తుత డిసెంబరు నుంచి వచ్చే 2024 మే నెలాఖరుకు రాబోయే ఆరు నెలల్లో కరెంట్ బిల్లులు వసూలు, ప్రభుత్వం నెలనెలా ఇచ్చే రాయితీతో కలిపి మొత్తం ఆదాయం రూ.22,781 కోట్లు ఉంటుంది.
రేపటి నుంచే అసెంబ్లీ సమావేశాలు - ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం
ఎన్ని యూనిట్లు వాడుతున్నారనే లెక్కలేమీ లేవు : కానీ ఇదే ఆరు నెలల్లో ఖర్చులు రూ.33,839 కోట్ల వరకు ఉంటాయని డిస్కంల అంచనా వేశాయి. ఆదాయ, వ్యయాల మధ్య లోటు రూ.11,058 కోట్లుగా ఉంటుందని తేలింది. ఇప్పటికే రెండు డిస్కంల నష్టాలు రూ.50,275 కోట్లకు చేరాయి. వ్యవసాయానికి పూర్తి ఉచితంగా కరెంట్ సరఫరా చేస్తున్నా వాస్తవంగా ఎన్ని యూనిట్లు వాడుతున్నారనే లెక్కలేమీ లేవని విద్యుత్ సంస్థలు ప్రభుత్వానికి తెలిపాయి.
అన్ని వర్గాల వారికి 24 గంటలూ విద్యుత్ సరఫరా : తెలంగాణలో మొత్తం 27.99 లక్షల వ్యవసాయ బోర్లకు విద్యుత్ కనెక్షన్లున్నాయి. రాష్ట్రం మొత్తం వినియోగంలో 40 శాతం వ్యవసాయానికి ఉండవచ్చనే అంచనా వేసి ప్రభుత్వం రాయితీ సొమ్ము ఇస్తోంది. రాష్ట్రంలో మొత్తం 1.82 కోట్ల కరెంట్ కనెక్షన్లు ఉన్నాయి. తలసరి వార్షిక వినియోగం 2349 యూనిట్లుగా ఉంది. ఇక అన్ని వర్గాల వారికి నిరంతరం 24 గంటలూ విద్యుత్ సరఫరా చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) డిస్కంలను ఆదేశించారు. ఎక్కడా రాజీ పడవద్దని స్పష్టం చేశారు.
ఆరు గ్యారెంటీ హామీల అమల్లో భాగంగా ప్రతి ఇంటికీ నెలకు 200 యూనిట్ల వరకు కరెంట్ ఉచితంగా (Free Electricity)సరఫరా చేయాల్సి ఉందని, దీనికి ఎంత వ్యయమవుతుందో శాస్త్రీయంగా అంచనాలు తయారు చేయాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అందరికీ 200 యూనిట్లు ఇస్తే ఏడాదికి దాదాపు రూ.4000 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి.
మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇటీవల రాజీనామా చేసిన ఉత్తర డిస్కం సీఎండీ గోపాలరావు, దక్షిణ డిస్కం సీఎండీ రఘుమారెడ్డి ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇటీవల రాజీనామా చేసిన ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు ఈ సమీక్ష సమావేశానికి హాజరు కాలేదు. ప్రభుత్వం తనను రమ్మని పిలవలేదని పిలిస్తే సమావేశానికి వెళ్లేవాడినని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు
ప్రజాదర్బార్‌కు విశేష స్పందన- సేవను మించిన తృప్తి లేదంటూ సీఎం ఎమోషనల్ ట్వీట్
Revanth Reddy Review on Power Sector : ప్రధానంగా నిరంతరం 24 గంటల సరఫరాకు అవసరమైనంత విద్యుత్ రాష్ట్రానికి సొంతంగా లేదు. బయటి నుంచి ఎక్కువగా కొనాల్సి వస్తోంది. ఉదాహరణకు భారత ఇంధన ఎక్స్ఛేంజిలో అధిక ధరలకు ఏ రోజుకారోజు కొనడం కోసం, డిస్కంలు నెలకు రూ.500 కోట్లు వెచ్చిస్తున్నాయి. వీటికి తోడు గత తొమ్మిదేళ్లలో తెలంగాణలో కొత్తగా ఉత్పత్తి ప్రారంభించిన కొత్తగూడెం 7వ దశ భద్రాద్రి, ఎన్టీపీసీ ప్లాంట్ నుంచి కరెంట్ కొనడానికి అధికంగా వెచ్చించాల్సి వస్తోంది.
బిల్లుల రూపంలో డిస్కంల ఆదాయం రూ.2,800 కోట్లు : అన్నివర్గాల వారు వాడే కరెంట్‌కు నెలనెలా చెల్లించే బిల్లుల రూపంలో రూ.2,800 కోట్ల ఆదాయం మాత్రమే డిస్కంలకు వస్తోంది. వ్యవసాయానికి, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పూర్తి ఉచితంగా మరికొన్ని వర్గాలకు తక్కువ ధరలకు ప్రభుత్వం విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. ఈ రాయితీల కోసం రాష్ట్ర సర్కార్ డిస్కంలకు ప్రతి నెలా మొదటివారంలో రూ.958 కోట్లు విడుదల చేస్తోంది. ఈ రెండూ కలిపితే మొత్తం నెలవారీ ఆదాయం రూ.3758 కోట్లు అని తేలింది. విద్యుత్ కొన్నందుకు డిస్కంలు నెలనెలా విద్యుదుత్పత్తి సంస్థలకు రూ.3305 కోట్లు చెల్లించాలి.
గతంలో తీసుకున్న అప్పులు, వడ్డీల వాయిదాలు : ఇవి కాకుండా గతంలో తీసుకున్న అప్పులు, వడ్డీల వాయిదాలకు నెలకు రూ.1457 కోట్లు కట్టాలి. ఈ రెండూ కలిపితే ఖర్చులు రూ.4762 కోట్లు అవుతోంది. ఇవి కాకుండా అప్పుడప్పుడు అనూహ్యంగా కరెంట్ డిమాండు పెరిగితే అదనపు వ్యయం తప్పదు. థర్మల్ కేంద్రాలకు అవసరమైన బొగ్గును రోజూ దాదాపు 50,000ల టన్నుల వరకు కొంటున్నారు. టన్నుకు సగటున రూ.4750 చొప్పున ధర చెల్లించి కొంటుండగా, దాన్ని బొగ్గు గనుల నుంచి థర్మల్ కేంద్రం వద్దకు చేర్చడానికి టన్నుకు రూ.240 చొప్పున అదనంగా రవాణా వ్యయం భారం పడుతోంది. సింగరేణి గనుల నుంచి బొగ్గును కొంటున్నా ఆ సంస్థకు ఎప్పటికప్పుడు సొమ్ము చెల్లించడం లేదు. రాష్ట్ర జెన్‌కో కొన్న బొగ్గుకు, సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలు రూ.6800 కోట్లకు చేరాయి.
రేపటి నుంచి తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం
రూ.3 కోట్లు విలువ చేసే మత్తుపదార్ధాలు స్వాధీనం - డ్రగ్స్ దందాపై పోలీసుల ఉక్కుపాదం