CM Revanth Reddy Meet Union Minister Piyush Goyal : దిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీరిక లేకుండా గడుపుతున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలు సహా కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమయ్యారు. హైదరాబాద్ వయా మిర్యాలగూడ-విజయవాడ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కాళేశ్వరం తప్పిదాలపై విజిలెన్స్ విచారణ ప్రారంభమైంది : మంత్రి ఉత్తమ్ కుమార్
హైదరాబాద్-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌కు కేంద్ర ప్రభుత్వం తుది అనుమతులు మంజూరు చేయాలని కోరారు. కేంద్రం తుది అనుమతులు మంజూరు చేస్తే రాష్ట్రానికి రూ.2,300 కోట్లు విడుదలవుతాయన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను సీఎం, కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్‌లో ప్రాధాన్య అంశంగా ఫార్మా సిటీని గత ప్రభుత్వం ప్రతిపాదించిందని, దానిని ఉపసంహరించుకుని నూతన ప్రతిపాదనలు పంపేందుకు అనుమతించాలని కేంద్రమంత్రిని ముఖ్యమంత్రి కోరారు.
యూపీఏ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌కు నేషనల్ డిజైన్ సెంటర్ మంజూరు చేసిందని, నాటి కేంద్రమంత్రి ఆనంద్ శర్మ దానికి శంకుస్థాపన చేశారని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రమంత్రి గోయల్‌కు గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఎన్డీసీని విజయవాడకు తరలించారని తెలంగాణకు ఎన్డీసీ మంజూరు చేయాలని కోరారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నెల్లూరు జిల్లాకు మెగా లెదర్ పార్క్ మంజూరు చేసిందని కేంద్రమంత్రితో ముఖ్యమంత్రి అన్నారు.
CM Revanth Delhi Tour Today : కరీంనగర్, జనగాం జిల్లాల్లో లెదర్ పార్క్ ఏర్పాటుకు అవసరమైన భూములున్నాయని, కేంద్ర ప్రభుత్వం మెగా లెదర్ పార్క్ మంజూరు చేస్తే వెంటనే భూమి కేటాయిస్తామని సీఎం తెలిపారు. ఇది మంచి ప్రతిపాదన అని ఇందుకు సంబంధించిన అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలంటూ సమావేశంలో పాల్గొన్న అధికారులకు కేంద్రమంత్రి సూచించారు.
'అభయహస్తం' దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలనకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలి : భట్టి
కేంద్ర ప్రభుత్వం పీఎం మిత్ర పథకంలో భాగంగా వరంగల్‌లోని మెగా టెక్స్‌టైల్ పార్క్(Textle Park)కు బ్రౌన్ ఫీల్డ్ హోదా ఇచ్చిందని, దానికి గ్రీన్‌ఫీల్డ్ హోదా ఇవ్వాలని కేంద్రమంత్రిని ముఖ్యమంత్రి అభ్యర్థించారు. బ్రౌన్‌ఫీల్డ్ నుంచి గ్రీన్ ఫీల్డ్‌కు మార్చితే పార్క్‌కు గ్రాంట్ల రూపంలో అదనంగా 300 కోట్ల నిధులు వస్తాయని, ఇది అక్కడి పరిశ్రమలకు ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
టెక్నికల్ టెక్స్‌టైల్స్ టెస్టింగ్ సెంటర్ల ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని ఇటీవల కేంద్రం ప్రకటించిందన్నారు. ఈ విషయంలో తెలంగాణ ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేసినందున రాష్ట్రానికి టెస్టింగ్ సెంటర్ మంజూరు చేయాలని కోరారు. తెలంగాణకు జాతీయ చేనేత సాంకేతిక కేంద్రం మంజూరు చేయాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ను ముఖ్యమంత్రి కోరారు.
రాష్ట్రంలో ఏడు చేనేత క్లస్టర్స్ ఉన్నాయని, ఐఐహెచ్‌టీ మంజూరు చేస్తే నేత కార్మికులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ఆదాయాలు పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. ఐఐహెచ్‌టీ ఎక్స్‌టెన్షన్ సెంటర్ ఏర్పాటుకు కేంద్రమంత్రి సానుకూలత వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి రాష్ట్రానికి రావల్సిన నిధులు విడుదల చేయాలని, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు.
మరోపక్క కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలతోనూ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఆదివారం మణిపుర్లో రాహుల్ భారత్ న్యాయ్ యాత్ర(Bharat NyayYatra) ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి సాయంత్రం దిల్లీకి చేరుకుని దావోస్ వెళ్లనున్నారు. ఈ నెల 21 వరకు దావోస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటన ఖరారు - ఈనెల 15న జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరు