జాతీయ చేనేత దినోత్సవం(national handloom day) సందర్భంగా చేనేత కార్మికులు, పద్మశాలీలకు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) శుభాకాంక్షలు తెలిపారు. స్వరాష్ట్రంలో చేనేత రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రభుత్వ దార్శనికత, మంత్రి కేటీఆర్ కార్యదక్షతతో.... అనతి కాలంలోనే పునరుజ్జీవింపజేశామని వ్యాఖ్యానించారు. చేనేత ఉత్పత్తుల ప్రాధాన్యత గుర్తించి... ఆదరించి ప్రోత్సహించే కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందన్న ముఖ్యమంత్రి... చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి, వారిని ఆత్మహత్యలనుంచి దూరం చేసి... ఆత్మస్థైర్యాన్ని నింపుతోందని వివరించారు.
బతుకమ్మ చీరలు, తదితర కార్యక్రమాలతో చేనేత కుటుంబాలకు చేతినిండా పని కల్పించి... ఆర్థికంగా భరోసా ఇస్తున్నామని తెలిపారు. చేనేత దినోత్సవం సందర్భంగా కళాకారులను గుర్తించి సత్కరించుకుంటూ కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట అవార్డులు అందిస్తున్నామని కేసీఆర్ అన్నారు. రైతుబీమా తరహాలో చేనేతకార్మికులకు బీమా సౌకర్యాన్ని అమల్లోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. చేనేత కార్మికులకు ఫించన్లు ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని కేసీఆర్ చెప్పారు. పద్మశాలీలను సామాజిక, ఆర్థిక రంగాల్లోనే కాకుండా రాజకీయ, పాలనా వ్యవస్థల్లోనూ ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
ఇదీ చదవండి: ఈ ఏడైనా వినాయక తయారీదారులకు విఘ్నాలు తొలగేనా..?