CM KCR Visited Hailstorm Rain Affeted Districts: వడగళ్లు, ఈదురు గాలులు, భారీ వర్షాలకు పంట నష్టపోయిన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ విస్తృతంగా పర్యటించారు. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల పర్యటనలో భాగంగా తొలుత ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బోనకల్ మండలంలోని రావినూతల, గార్లపాడు గ్రామాలు సందర్శించారు. నష్టపోయిన పంటలను పరిశీలించి జరిగిన నష్టంపై రైతులతో ఆరా తీశారు. ఉన్నతాధికారులు, మంత్రులు, సీపీఐ, సీపీఎం కార్యదర్శులు పాల్గొన్నారు.
తీవ్రంగా దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను పరిశీలించి.. నష్టపోయిన రైతులతో సీఎం మాట్లాడారు. పంటనష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆరుగాలం శ్రమించి మొక్కజొన్న సాగుచేస్తే... తీరా చేతికొచ్చే సమయానికి ప్రకృతి విపత్తుతో అంతా తుడిచిపెట్టుకుపోయిందని కర్షకులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పంటలు నష్టపోయిన రైతుల్ని అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు.
కేంద్రం ఎటువంటి సహాయం చేయడం లేదు: కేంద్రం రైతులకు ఎలాంటి సాయం చేయడం లేదని.. అందుకే ఈసారి నివేదిక పంపబోమని ఆయన స్పష్టంచేశారు. ఖమ్మం జిల్లా పర్యటన అనంతరం మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని పెద్దవంగర మండలం రెడ్డికుంటతండాలో దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ పరిశీలించారు. మొక్కజొన్న, మిర్చి పంటలు, మామిడి తోటలను చూశారు. రైతులతో మాట్లాడి వారిని ఓదార్చి.. ధైర్యాన్ని నింపారు.
అనంతరం కాన్వాయిలోనే వెంట తెచ్చుకున్న సద్దన్నం తిన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురంలో పంటల్ని పరిశీలించి రైతులకు భరోసానిచ్చారు. పంటలతో సంబంధం లేకుండా ఎకరానికి10 వేల ఆర్థిక సాయం ప్రకటించారు. అక్కడి నుంచి కరీంనగర్ రామడుగు మండలం లక్ష్మీపూర్ శివారులో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను కేసీఆర్ పరిశీలించారు. వడగళ్ల వల్ల చేతి కందాల్సిన పంట వర్షార్పణమైందని రైతులు సీఎం వద్ద మొర పెట్టుకున్నారు.
నష్టం వివరాలను సీఎం, వ్యవసాయశాఖ మంత్రి, కలెక్టర్‌కు వివరించారు. కేసీఆర్ వెంట మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ప్రణాళికసంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్ తదితరులు ఉన్నారు. కౌలు రైతులకు బాసటగా నిలుస్తామన్న ముఖ్యమంత్రి పంట నష్టపోయిన వారికే పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
"ఇన్సురెన్స్ కంపెనీలకు లాభాలు తెచ్చే బీమాలు ఉన్నాయి తప్పిస్తే.. రైతుల పంటలకు నష్టం కలిగిస్తే లాభాలు ఇచ్చే పాలసీలు లేవు. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం అయితే చెవుటోడి ముందు శంఖం ఊదినట్లే లెక్క. కేంద్రానికి నివేదిక పంపాలనుకోలేదు. గతంలో పంపిన దానికి ఒక్క రూపాయి ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వమే ఎకరానికి రూ.10వేలు చొప్పున అందిస్తుంది. రైతులు, కౌలురైతులు ఇద్దరికీ అందిస్తుంది." - సీఎం కేసీఆర్
ఇవీ చదవండి: