ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను సందర్శించనున్నారు. కరీంనగర్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరి ఉదయం కాళేశ్వరంలో ముక్తేశ్వరస్వామిని దర్శించుకుంటారు. స్వామి వారికి ప్రత్యేజ పూజలు చేసి అక్కడి నుంచి మేడిగడ్డ చేరుకుంటారు. లక్ష్మి ఆనకట్ట, జలాశయాన్ని సీఎం పరిశీలిస్తారు. ప్రస్తుతం లక్ష్మి జలాశయం పూర్తి స్థాయిలో జలకళను సంతరించుకొంది. ఎగువ నుంచి కొనసాగుతోన్న ప్రవాహంతో నిండుకుండను తలపిస్తోంది.
లక్ష్మి ఆనకట్ట పరిశీలన
ఆనకట్ట గరిష్ఠ ఎత్తు వంద మీటర్లు కాగా ప్రస్తుతం లక్ష్మి ఆనకట్ట వద్ద జలాలు 99.2 మీటర్లకు పైనే ఉన్నాయి. మొత్తం సామర్థ్యమైన 16.17 టీఎంసీలకు గాను దాదాపు 14 టీఎంసీల మేర జలాశయంలో నీరు నిల్వ ఉంది. పూర్తి నిల్వ స్థాయికి చేరుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ లక్ష్మి ఆనకట్టను పరిశీలించనున్నారు. జలాశయంలో నీటి నిల్వ, ఎగువ నుంచి కొనసాగుతున్న ప్రవాహం, నీటి ఎత్తిపోత తదితర అంశాలను పరీక్షించనున్నారు. అధికారులు, ఇంజినీర్లతో అక్కడే సమీక్ష నిర్వహించనున్నారు.
విహంగవీక్షణం చేయనున్న సీఎం
వర్షాకాలంలో జలాశయంలోకి ప్రవాహం అధికంగా ఉండనుంది. వీలైనంత ఎక్కువ నీటిని ఎగువకు ఎత్తిపోయాల్సి ఉంటుంది. ఆ మేరకు కాల్వలు, వ్యవస్థ సిద్ధం చేసుకోవడం సహా ఇతర అంశాలపై అధికారులు, ఇంజినీర్లతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. ప్రాజెక్ట్‌లో మిగతా పనులతో పాటు అదనపు టీఎంసీ పనుల విషయమై కూడా సీఎం సమీక్షించనున్నారు. కాళేశ్వరం పర్యటన సందర్భంగా ప్రాణహిత, గోదావరి నదులు, పరివాహక ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు.
ఇవీ చూడండి: తీగలగుట్టపల్లికి చేరుకున్న సీఎం కేసీఆర్