cm kcr tour schedule : పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్ వేగవంతం చేశారు. వరుస కార్యక్రమాలు, జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొననున్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో అటు పార్టీ... ఇటు ప్రభుత్వ కార్యక్రమాల్లో కేసీఆర్ వరుసగా పాల్గొననున్నారు. శుక్రవారం పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో సమావేశం కానున్న కేసీఆర్... శనివారం మంత్రులు, కలెక్టర్లతో సమావేశం అవుతారు. ఆదివారం నుంచి జిల్లాల పర్యటనలు చేపట్టనున్నారు. వనపర్తితో ప్రారంభమయ్యే జిల్లా పర్యటనలు జనగాం, నాగర్ కర్నూల్, జగిత్యాల, నిజామాబాద్, యాదాద్రి, వికారాబాద్లోనూ జరగనున్నాయి.
17న తెరాస ప్రజాప్రతినిధులతో సమావేశం
CM kcr meets ministers: తెరాస ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 17న తెలంగాణ భవన్లో సమావేశం కానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు తెరాస ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్ల సంయుక్త సమావేశం జరగనుంది. డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులతో పాటు రైతుబంధు జిల్లా కమిటీల అధ్యక్షులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల ఛైర్మన్లు, తెరాస రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూడా సంయుక్త సమావేశంలో పాల్గొననున్నారు.
భవిష్యత్ కార్యాచరణపై చర్చ
ధాన్యం కొనుగోళ్లు, యాసంగిలో పంటల సాగు, కేంద్ర ప్రభుత్వ వైఖరి, ప్రభుత్వ ఆలోచనలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. భవిష్యత్ కార్యాచరణను ముఖ్యమంత్రి కేసీఆర్ నేతలను వివరించనున్నారు.
కలెక్టర్లతో మీటింగ్
cm kcr meet with collectors : ఈనెల 18న (శనివారం) జిల్లా కలెక్టర్లతో సీఎం సమావేశం కానున్నారు. ప్రగతిభవన్‌లో జరగనున్న సమావేశంలో మంత్రులు, సీనియర్ అధికారులు, కలెక్టర్లు పాల్గొంటారు. దళితబంధు పథకంతో పాటు ఇతర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. హుజూరాబాద్ సహా ఇప్పటికే ప్రకటించిన నాలుగు మండలాల్లో దళితబంధు అమలవుతోంది. ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాకు నగదును కూడా బదిలీ చేశారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ మార్చినెలలోపు అమలు చేయాలని గతంలో నిర్ణయించారు. ఈ విషయమై కలెక్టర్ల సమావేశంలో చర్చిస్తారు.
చర్చించే అంశాలు
దళితబంధు అమలు దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులకు శిక్షణా కార్యక్రమాల నిర్వహణపై కూడా సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ధాన్యం సేకరణ, పంటలసాగు అంశంపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. జిల్లాల వ్యవసాయ అధికారులు కూడా సమావేశంలో పాల్గొంటారు. పోడు భూముల దరఖాస్తులు, పరిష్కారం, ధాన్యం సేకరణ, యాసంగి పంటల సాగు, పల్లెప్రగతి, పట్టణప్రగతి, హరితహారం, ధరణి సంబంధిత అంశాలు, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు సహా వివిధ అంశాలపై కలెక్టర్లు, అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
జిల్లాల పర్యటన
cm kcr plans district tours : ఈ నెల 19 (ఆదివారం)నుంచి జిల్లాల పర్యటనకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. గతంలో నాలుగు జిల్లాల్లో సీఎం పర్యటించారు. వనపర్తి నుంచి మళ్లీ జిల్లాల పర్యటనలను ప్రారంభించనున్నారు. ఆదివారం వనపర్తిలో పర్యటించనున్న ముఖ్యమంత్రి... నూతన కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు.
శంకుస్థాపనలు.. బహిరంగ సభలు
కొత్త మార్కెట్ యార్డును, రెండు పడకల గదుల ఇండ్లను కూడా ప్రారంభిస్తారు. వైద్యకళాశాల, నర్సింగ్ కళాశాల, కర్నెతండా ఎత్తిపోతల, వేరుశనగ పరిశోధనా కేంద్రం, గొర్రెల పునరుత్పత్తి కేంద్రం, సబ్ రిజిస్ట్రార్, నీటి పారుదల శాఖ సీఈ కార్యాలయాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. తెరాస జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్న కేసీఆర్... పార్టీ ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
ఈనెల 20న జనగామలో..
cm kcr plans district tours : 20వ తేదీన జనగామ జిల్లాలో పర్యటించనున్న సీఎం కేసీఆర్... కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు తెరాస జిల్లా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. బహిరంగసభలోనూ పాల్గొంటారు. ఇతర జిల్లాల్లోనూ ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. ఆ తేదీలు త్వరలోనే ఖరారు కానున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించనున్న సీఎం... ఉమామహేశ్వర ఎత్తిపోతల పథకం, జలాశయానికి శంఖుస్థాపన చేయడంతో పాటు వంద పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తారు.
నిజామాబాద్, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ జిల్లాల్లోనూ పర్యటించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్... కొత్త కలెక్టరేట్లను ప్రారంభించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆయా జిల్లాల్లో పూర్తైన తెరాస జిల్లా కార్యాలయాలను కూడా ప్రారంభించనున్నారు.
ఇదీ చూడండి: ఎల్లుండి పార్టీ ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ కీలక భేటీ