CM KCR on Podu lands distribution : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ పద్దులపై రెండో రోజు చర్చ కొనసాగుతోంది. శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క.. పోడు భూముల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంలో గిరిజనులపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. సీతక్కతో పాటు ఎమ్మెల్యేలు వీరయ్య, సుదర్శన్‌రెడ్డిలు కూడా పోడు భూములపై గతంలో ఇచ్చిన హక్కు పత్రాలను సమీక్షించాలని కోరారు. ఆ హక్కు పత్రాలపై అనేక అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు.
CM KCR on Girijana Bandhu : వీరి ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానమిచ్చారు. కేసీఆర్ మాట్లాడుతూ.. పోడుభూములు అనేవి హక్కు కాదు.. దురాక్రమణ అని అన్నారు. విచక్షణారహితంగా అడవులు నరికివేయడం సరికాదని చెప్పారు. పర్యావరణ పరిరక్షణపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయన్న కేసీఆర్.. పోడు, అటవీభూములు.. పలువురికి ఆటవస్తువులా తయారయ్యాయని మండిపడ్డారు. అదే విధంగా ఈ విషయంలో గిరిజనులపై దౌర్జన్యం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
CM KCR in TS Budget sessions 2023-24 :'పోడు భూములపై మాకు ప్రత్యేక విధానం ఉంది. రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల అటవీ భూములు ఉన్నాయి. అటవీ భూములపై ఇప్పటికే నివేదికలు సిద్ధం అయ్యాయి. అన్ని పార్టీల నేతలు ఒప్పుకుంటేనే 11.5 లక్షల ఎకరాలు పంపిణీ చేస్తాం. గుత్తికోయలను తీసుకువచ్చి అడవులను నరికివేయిస్తున్నారు. అటవీశాఖ అధికారులపై దాడులు సరికాదు. గిరిజనులకు గత పాలకులు చేసిన మోసాలు అందరికీ తెలుసు.' - కేసీఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రి
ఈ నెలాఖరులో పోడు భూముల పంపిణీ ప్రారంభిస్తామని అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించారు. పంపిణీ చేశాక రైతుబంధు, విద్యుత్, సాగునీటి సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఇకనుంచి పోడు భూములు రక్షిస్తామని హామీ ఇవ్వాలని అన్నారు. పోడు భూముల పంపిణీ పూర్తయ్యాక అటవీప్రాంతాలను ఆక్రమిస్తే ఊరుకోమని హెచ్చరించారు. భూమిలేని గిరిజన బిడ్డలకు గిరిజన బంధు ఇచ్చి సాయం చేస్తామని ప్రకటించారు. గిరిజనులపై పోలీసులు, అటవీ అధికారులు దాడి చేయవద్దని ఆదేశించారు. అదే సమయంలో అధికారులపైనా గిరిజనుల దాడులు సహించబోమని స్పష్టం చేశారు.
'ఇకనుంచి అటవీ ప్రాంతాల్లోని ఒక్క చెట్టును కూడా కొట్టనివ్వం. పర్యావరణ పరిరక్షణకు మరిన్ని చర్యలు చేపడతాం. అడవుల రక్షణ అనేది మనందరి బాధ్యత. కొందరు అగ్ర కులస్థులు గిరిజన యువతులను పెళ్లాడుతున్నారు. ఖమ్మం జిల్లాలో పలువురు అగ్ర కులస్థులు అటవీ భూములు కబ్జా చేశారు. 10, 20 ఎకరాల పోడు భూములు ఎవరికైనా ఉంటాయా?' అని కేసీఆర్ ప్రశ్నించారు.