CM KCR Review on Telangana Decade Celebrations : రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్ల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అందుబాటులో ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశమైన సీఎం... సంబంధిత అంశాలపై చర్చించారు. జూన్ రెండో తేదీ నుంచి రోజూ వారీ తలపెట్టిన కార్యక్రమాలకు సంబంధించి ఆయా శాఖలు తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వివరించారు.
CM KCR Meeting with Officials : ఉత్సవాలు ఘనంగా జరగాలని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను మరోమారు ఆదేశించారు. కొత్త సచివాలయం ఉద్యోగులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా విధి నిర్వహణకు అనువుగా గొప్పగా నిర్మాణమైందన్న సీఎం కేసీఆర్... అధికారులు, సిబ్బంది ఆహ్లాదకర వాతావరణంలో పనిచేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. సచివాలయం ప్రారంభించుకుని నెల రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో మౌలిక వసతులు, సౌకర్యాల అందుబాటు రావడం గురించి సీఎస్, అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. అన్ని సజావుగా ఉండడంపై సీఎం సంతోషం వ్యక్తం చేశారు. సచివాలయంలో పూర్తిస్థాయి కార్యకలాపాలు కొనసాగుతున్న తరుణంలో ప్రభుత్వ విభాగాధిపతుల కార్యాలయాలను ఒకే చోటకు చేర్చే విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించారు.
హెచ్ఓడీలన్నీ ఒకే చోట ఉండేలా ట్విన్ టవర్ల నిర్మాణం : హెచ్ఓడీ అధికారులకు సచివాలయంతో తరచూ పని ఉంటున్న నేపథ్యంలో వారి కార్యాలయాలను కూడా సెక్రటేరియట్ దగ్గర్లోనే సమీకృతంగా ఒకేచోట నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అన్ని రంగాలకు చెందిన ప్రభుత్వ శాఖల్లోని హెచ్ఓడీలు, వాటి ఆధ్వర్యంలో పని చేస్తున్న పూర్తి స్థాయి సిబ్బంది సంఖ్య, తదితర అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సచివాలయానికి అందుబాటులో విశాలవంతమైన ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడున్నాయో ఆరా తీశారు. స్థల నిర్ధారణ తర్వాత అవసరం మేరకు... హెచ్ఓడీలన్నీ ఒకేచోట ఉండేలా ట్విన్ టవర్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. సమీక్ష అనంతరం అమరుల స్మారకం పరిసరాలకు చేరుకున్న ఆయన... పనుల పురోగతి తెలుసుకున్నారు.
అభివృద్ధి పనులు పరిశీలించిన సీఎం కేసీఆర్ : సచివాలయం, స్మారకం మధ్య ఉన్న కూడలి అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. పనులన్నీ పూర్తయి చివరిదశ సుందరీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో రోడ్లు, భవనాల శాఖ ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు. విశాలమైన స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. విగ్రహానికి రెండు వైపులా అత్యద్భుతమైన ఫౌంటేన్లతో సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. బీఆర్కే భవన్ వద్ద నిర్మించిన వంతెనలను సీఎం పరిశీలించారు. అక్కడ ఉన్న కూడలిలో ఫౌంటేయిన్, ల్యాండ్ స్కేపింగ్ చేపట్టాలని తెలిపారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఆర్అండ్‌బీ అధికారులను కేసీఆర్ ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నన్ని రోజులు అమరుల స్మారకం వద్దకు వచ్చే ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా, ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.
ఇవీ చదవండి :