రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పల్లె, పట్టణ ప్రగతి అమలు సహా.. బృహత్ పల్లె ప్రకృతి వనాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. వైకుంఠధామాలు, సమీకృత వెజ్- నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాలు, వరి ధాన్యం సేకరణపై సమాలోచనలు చేశారు. రాష్ట్రాలు, స్థానికసంస్థల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని కేసీఆర్ తప్పుపట్టారు.
సరైన విధానం కాదు... పంచాయతీ రాజ్ వ్యవస్థలో మూడంచెల విధానం వచ్చిన తర్వాత... రాష్ట్రాలను నమ్మకుండా కేంద్రమే నేరుగా పల్లెలకు నిధులు పంపడం చిల్లర వ్యవహారమని కేసీఆర్ ఘాటుగా స్పందించారు. రాజీవ్ గాంధీ నుంచి నేటి ప్రధాని వరకు ఇదే తీరును అనుసరించడం సరికాదన్నారు. జవహర్ రోజ్ గార్ యోజన, గ్రామ్ సడక్ యోజన, నరేగా వంటి పథకాలను దిల్లీ నుంచి అమలు చేయాలనుకోవడం సమర్థనీయం కాదన్నారు. రాష్ట్రాల్లో నెలకొన్న స్థానిక పరిస్థితులు అక్కడి ప్రభుత్వాలకే తెలుస్తాయన్న సీఎం... రోజువారి కూలీల డబ్బులు కూడా దిల్లీ నుంచి కేంద్రమే పంచాలనుకోవడం సరైన విధానం కాదని సీఎం ఆక్షేపించారు.
జోక్యం చేసుకోవడం అర్ధరహితం... 75 సంవత్సరాల అమృత్ మహోత్సవాల నేపథ్యంలోనూ... దేశంలోని కొన్ని పల్లెలు, పట్టణాలు కరెంటు లేక చీకట్లలో మగ్గుతున్నాయని సీఎం కేసీఆర్ ఆరోపించారు. తాగు, సాగునీరు లేక ప్రజలు రోడ్ల మీదకు ఎక్కుతున్నారని వ్యాఖ్యానించారు. విద్య, వైద్యం వంటి అనేక రంగాల్లో రావాల్సినంత ప్రగతి రాలేదని...కేంద్ర ప్రభుత్వం ఇటువంటి అంశాల మీద దృష్టి పెట్టకుండా, రాష్ట్రాల విధుల్లో జోక్యం చేసుకోవాలనుకోవడం అర్ధరహితమని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
సంక్షేమం దిశగా ప్రభుత్వం కృషి.. ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్ర పాలనలో ధ్వంసమైన తెలంగాణను బాగు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా కష్టపడాల్సి వస్తోందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అన్ని కష్టాలను అధిగమించి నేడు దేశం గర్వించే స్థాయిలో రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలను అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపు వస్తోందన్న కేసీఆర్...రెండు పర్యాయాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ గ్రామాలకు అవార్డులు దాదాపు తెలంగాణకే రావటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రికి అభినందనలు తెలిపారు. ఫలితాలు ఊరికే రావని... ప్రజల సంక్షేమం దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు... అమలు చేస్తున్న కార్యాచరణతో పాటు అధికారులు చిత్తశుద్ధితో పనిచేసినప్పుడే సాధ్యమవుతాయని గుర్తుచేశారు.
వారికి మనస్ఫూర్తిగా అభినందనలు.. రాష్ట్రంలో కొత్త పంచాయతీ రాజ్ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు పలువురు అనుమానాలను వ్యక్తం చేశారని...వాటిని పటాపంచలు చేస్తూ పల్లెలను అభివృద్ధి పథాన నడిపించుకుంటున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రతి గ్రామానికి మౌలిక వసతులను కల్పిస్తూ ప్రగతి సాధిస్తున్నామన్న ముఖ్యమంత్రి... ప్రభుత్వం చేపట్టిన చర్యలు గ్రామాల్లో స్ఫూర్తిని నింపాయని చెప్పారు. దేశ పర్యావరణం, పచ్చదనంలో భాగస్వామ్యం పంచుకోవడంలో.. తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని సీఎం అన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి అస్తవ్యస్తంగా ఉన్న గ్రామీణ మంచినీటి వ్యవస్థను దేశం గర్వించేలా మిషన్ భగీరథ ద్వారా తీర్చిదిద్దుకున్నామని తెలిపారు. అనతికాలంలో అనితర సాధ్యమైన అభివృద్ధిని సాధించామన్న సీఎం... ఇందులో భాగస్వాములైన ప్రజా ప్రతినిధులను, ప్రభుత్వ యంత్రాంగానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు.
పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ కోసం తన జీవితాన్ని అర్పించిన కర్ణాటక రాష్ట్రానికి చెందిన 110 సంవత్సరాల పద్మశ్రీ తిమ్మక్కను మంత్రులు, ఉన్నతాధికారుల సమక్షంలో సీఎం కేసీఆర్ ఘనంగా సన్మానించారు.
ఇవీ చదవండి: లైంగిక వేధింపులు తట్టుకోలేక కోడలు దాడి.. మామ మృతి.. రహస్య వీడియోలు వైరల్..
స్ట్రెచర్‌పై పడుకునే ఎగ్జామ్ రాసిన విద్యార్థి- ఏం డెడికేషన్ గురూ!