కరోనా వల్ల రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టంపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. 2020- 2021 బడ్జెట్‌పై మధ్యంతర సమీక్ష జరుపుతారు. కరోనా ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు, సవరించుకోవాల్సిన అంశాలపై సీఎం పూర్తి స్థాయిలో చర్చిస్తారు.
ఈ సమీక్షలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, అధికారులు పాల్గొంటారు. శనివారం నాటి జరిగే సమీక్షలో వచ్చే అంచనాలపై మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులతో సీఎం కేసీఆర్ ఆదివారం సమావేశమయ్యే అవకాశం ఉంది.
అలాగే శనివారం సాయంత్రం యాదాద్రి దేవాలయ నిర్మాణ పనులపైనా సీఎం సమీక్షించనున్నారు. యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, వైటీడీఏ ప్రత్యేకాధికారి కిషన్ రావు, ఆర్ అండ్ బీ అధికారులు, ఆలయ కార్యనిర్వహణాధికారి గీత తదితరులతో సీఎం సమావేశం కానున్నారు. యాదాద్రి దేవాలయ నిర్మాణం, పనుల పురోగతిపై సమాలోచనలు చేయనున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు