హైదరాబాద్‌లో వరదలు కేంద్రం నిర్లక్ష్యంలో భాగమేనని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. వరదలు నియంత్రించేలా చర్యలు చేపడతామని జీహెచ్‌ఎంసీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. నగరాభివృద్ధిలో భాగంగా మెట్రో రైల్ రెండో దశ పూర్తి చేయడంతో పాటు రీజినల్ రింగ్‌రోడ్‌ను చేపడతామని సీఎం ప్రకటించారు. త్వరలోనే కేశవాపురం జలాశయ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు. రూ.13 వేల కోట్ల అంచనా వ్యయంతో వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రణాళిక, రూ.12 వేల కోట్ల అంచనాతో సమగ్ర వరదనీటి నిర్వహణ ప్రణాళికను తీసుకొస్తామన్నారు. మూసీతో గోదావరి నీటిని అనుసంధానించి ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారు. బాపుఘాట్ నుంచి నాగోల్ వరకు మూసీ నది మధ్యలో బోటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు.
"రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే జీహెచ్‌ఎంసీ అభివృద్ధి సాధ్యం. గ్రేటర్ ఎన్నికల్లో ఇతర పార్టీలు గెలిచినా ఉపయోగం ఉండదు. గతంలో ఎన్నో నగరాల్లో వరదలు వచ్చినా ఎక్కడా ప్రజలకు రూ.10వేల సాయం చేయలేదు. కొంతమంది ఫిర్యాదుతో ఎస్‌ఈసీ ఒత్తిడికిలోనై ఎస్‌ఈసీ వరదసాయాన్ని నిలిపివేసింది. ఎన్నికల తర్వాత మిగిలిన వారికి వరదసాయాన్ని తప్పకుండా అందిస్తాం. ప్రశాంత హైదరాబాద్ కావాలా? కల్లోల హైదరాబాద్ కావాలా? టీఎస్ బీపాస్ కావాలా.. కర్ఫ్యూ పాస్ కావాలా? అనేది ప్రజలే తేల్చుకోవాలి. హైదరాబాద్‌లో కల్లోలం చెలరేగితే స్థిరాస్తి రంగం కుదేలవుతుంది. మెట్రో నగరాలకు ఏటా రూ.6వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని అడిగాం. మా విజ్ఞప్తిని కేంద్రం పట్టించుకోలేదు. హైదరాబాద్‌లో అన్ని మతాల వారిని గౌరవించాం. తప్పుడు వ్యక్తులు, శక్తులకు ఓటేస్తే అది కాటేస్తుంది." -ముఖ్యమంత్రి కేసీఆర్
ఇవీ చూడండి: 'ప్రధాన కేంద్రాల నుంచి విమానాశ్రయానికి మెట్రో రైలు'