CM KCR Public Meeting Nirmal Today : తెలంగాణ ప్రజల హక్కుల కోసమే బీఆర్ఎస్ పుట్టిందని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. 15 ఏళ్లు నిర్విరామంగా పోరాడి తెలంగాణ సాధించుకున్నామని తెలిపారు. పదేళ్లు బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించారని.. మరో పదేళ్లు ఆశీర్వదించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ నియోజకవర్గంలో ఇవాళ కేసీఆర్ పర్యటించారు. అక్కడ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు.
CM KCR Fires on Congress in Nirmal Meeting : నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ సాధించుకున్నామని.. ఆ ఆశయాలు ఇప్పటికే నెరవేరాయని సీఎం కేసీఆర్ చెప్పారు. కేవలం ఇవే కాకుండా తొమ్మిదన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా మారిందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ తాను హామీ ఇచ్చినవే కాకుండా.. మాటివ్వని హామీలు కూడా నెరవేర్చామని కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ ప్రవేశపెట్టిన పథకాలు.. రూపొందిస్తున్న కార్యక్రమాలను ఇప్పుడే దేశం పాటిస్తోందని అన్నారు.
"తెలంగాణ రాకపోతే నిర్మల్.. జిల్లా అయ్యేదా? నిర్మల్ జిల్లా కావాలని ఇంద్రకరణ్ రెడ్డి తపనపడ్డారు. నిర్మల్‌కు మెడికల్ కాలేజీ వస్తుందని ఏనాడైనా అనుకున్నామా? ఇంద్రకరణ్ రెడ్డి మెజారిటీ 80 వేలు దాటాలి. పదేళ్లుగా శాంతియుతంగా రాష్ట్రాన్ని పాలిస్తున్నాం. దేశంలోనే మొదటిసారిగా దళిత బంధు స్కీమ్ తెచ్చాం. 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చాలా వరకు విద్యుత్ కష్టాలున్నాయి. మొన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కర్ణాటకలోనూ కరెంట్ కోతలే కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు ఈ రెండు పార్టీల్లో దేనికైనా ఈ ఎన్నికల్లో అవకాశం ఇస్తే మన తెలంగాణలో కూడా కరెంట్ కోతలు తప్పవు. మోటార్లకు మీటర్లూ తప్పవు." - కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి
KCR Speech at Nirmal Meeting Today : నష్టం వచ్చినా రైతుల వద్ద పంట కొంటున్నామని కేసీఆర్ అన్నారు. ఎన్నికల సంఘం అధికారులు అనుమతిస్తే రైతు రుణ మాఫీ ఇప్పుడే ఇస్తామని చెప్పారు. రైతుబంధు దుబారా అని ఉత్తమ్ కుమార్ అంటున్నారని.. రైతులకు 3 గంటల కరెంటు చాలని రేవంత్ రెడ్డి అంటున్నారని మండిపడ్డారు. రైతుల సంక్షేమం కోసం నిరంతరం ఆరాటపడుతూ.. వారి అభివృద్ధే పరమావధిగా భావిస్తూ వారి పురోగతికి బీఆర్ఎస్ కట్టుబడి ఉందని కేసీఆర్ పునరుద్ఘాటించారు.
CM KCR on Dharani Portal : ధరణి తీసేస్తే.. రైతు బంధు, రైతు బీమా కూడా పోతాయని కేసీఆర్ తెలిపారు. ధరణి తీసేస్తే.. మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని పేర్కొన్నారు. గిరిజనులకు నాలుగు లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చామని.. అభివృద్ధి కొనసాగాలంటే.. మళ్లీ బీఆర్ఎస్‌ను గెలిపించాలని సీఎం కేసీఆర్ కోరారు. కారు గుర్తుకు ఓటువేస్తే రాష్ట్రంలో జెడ్ స్పీడ్‌లో అభివృద్ధి దూసుకెళ్తుందని వ్యాఖ్యానించారు.
'దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య పోటీ అంటూ రాహుల్ గాంధీ పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు'