హైదరాబాద్లోని ఎల్బీస్టేడియంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ విందు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. జీహెచ్ఎంసీ, పోలీసు, వైద్య, ఫైర్, వాటర్ వర్క్స్ అన్ని శాఖల అధికారుల సమన్వయంతో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్తో పాటు సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా తనను తాను ప్రేమించినట్లే.. పొరుగువారిని ప్రేమించాలని క్రీస్తు చెప్పారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఏసుక్రీస్తు బోధనలు పాటిస్తే అందరం గొప్పవాళ్లమవుతామని తెలిపారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంత పురోగమించినా.. క్రీస్తు బోధనలు అనుసరణీయమని వ్యాఖ్యానించారు. సంతోషకర సమాజం కోసం క్రీస్తుతో పాటు మరెందరో మహానుభావులు కృషి చేశారన్న ముఖ్యమంత్రి.. క్రీస్తు బోధనలు అందరూ పాటించి సంతోషకర జీవితాన్ని గడపాలని సూచించారు.
ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం వరకు తెలంగాణ అనంతమైన వివక్ష ఎదుర్కొందని సీఎం పేర్కొన్నారు. 20 ఏళ్ల క్రితం గొప్ప సంకల్పంతో జై తెలంగాణ నినాదం ఎత్తుకున్నానని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రం ఎన్నో విషయాల్లో దేశానికి ఆదర్శంగా ఉందన్న సీఎం.. అన్ని మతాలను సమానంగా చూడటంలో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని స్పష్టం చేశారు. తెలంగాణ వలే భారత్ కూడా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. శాంతికాముక దేశంగా భారత్‌కు ఉన్న పేరు నిలబెట్టుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రైస్తవ పెద్దలతో సమావేశమవుతానని స్పష్టం చేశారు.
తనను తాను ప్రేమించినట్లే పొరుగువారిని ప్రేమించాలని క్రీస్తు చెప్పారు. క్రీస్తు బోధనలు పాటిస్తే అందరం గొప్పవాళ్లం అవుతాం. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంత పురోగమించినా.. క్రీస్తు బోధనలు అనుసరణీయం. అన్ని మతాలను సమానంగా చూడటంలో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోంది. తెలంగాణ వలే భారత్ కూడా అభివృద్ధి చెందాలి. త్వరలోనే రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రైస్తవ పెద్దలతో సమావేశమవుతాను. - సీఎం కేసీఆర్
ఇవీ చూడండి..