కొత్త సచివాలయ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం సచివాలయ ప్రాంగణానికి వెళ్లిన సీఎం... నిర్మాణ పనులను పరిశీలించారు. సచివాలయ భవన నిర్మాణ ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి కలియతిరిగారు. నిర్మాణ పనుల్లో ఉన్న ఇంజినీర్లు, గుత్తేదార్ల ప్రతినిధులతో మాట్లాడారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, అత్యంత నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రధాన గేట్తో పాటు, ఇతర గేట్లు నిర్మించే ప్రాంతాలు, భవన సముదాయం నిర్మించే ప్రాంతాన్ని, డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు.
మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్అండ్బీ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, ఈఎన్సీ గణపతి రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, అధికారులు సీఎం వెంట ఉన్నారు.
రాష్ట్ర నూతన సచివాలయ నిర్మాణ పనులను ముంబయికి చెందిన షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ దక్కించుకుంది. రూ.617 కోట్ల వ్యయంతో నూతన సచివాలయ సముదాయాన్ని నిర్మించనున్నారు.
ఇదీ చదవండి: ప్రగతి భవన్లో జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్