Illegal constructions Issue In Hyderabad : హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలకు అడ్డే లేకుండా పోయింది. కొందరి అధికారుల అవినీతే అక్రమ నిర్మాణాలకు పునాదిగా మారింది. నిర్మాణదారులు కొందరు వారానికో స్లాబును నిర్మిస్తుంటే మరికొందరు ఇష్టానుసారం సెల్లారు గుంతలు తవ్వి పక్కనున్న బిల్డింగ్‌లను ప్రమాదంలోకి నెడుతున్నారు. ఇలాంటి తొందరపాటు చర్యలకు గచ్చిబౌలిలోని సిద్దిఖీనగర్‌లో మంగళవారం జరిగిన దుర్ఘటనే నిదర్శనం. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి.
పక్కనే ఉన్న నానక్‌రామ్‌గూడలో డిసెంబరు, 2016లో నిర్మాణంలోని 6 అంతస్తుల భవనం పేకమేడలా కూలి 11 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు. జీహెచ్‌ఎంసీ ప్లానింగ్ విభాగం అధికారులు యజమాని వద్ద లంచం తీసుకుని, పనులను వేగంగా పూర్తి చేసుకోవాలని ఆదేశించడంతో యజమాని వాయువేగంతో నిర్మాణ పనులను పూర్తి చేస్తున్న క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది.
ఇటీవల కాలంలో ప్రమాదాలు : ఆగస్టు 2023లో బహదూర్‌పుర హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్మాణంలోని 4 అంతస్తుల బిల్డింగ్ పక్కకు ఒరిగింది. యజమాని రెండు అంతస్తుల వరకు బిల్డింగ్ నిర్మించేందుకు పర్మిషన్ తీసుకుని నాలుగంతస్తులు నిర్మిస్తుండగా పనులన్నీ పూర్తయ్యాక సంపునిర్మాణం కోసం ఇంటి లోపల తవ్వకం పనులు చేపట్టగా భవనం పక్కకు ఒరిగింది. దీంతో ఆ బిల్డింగ్‌ను కూల్చివేయించారు.
జులై, 2023లో చింతల్ జనవరి 7, 2023న కూకట్‌పల్లి బీజేపీ కార్యాలయం రోడ్డులో హాస్టల్ కోసం నిర్మాణ పనులు చేపట్టిన యజమాని వెంట వెంటనే పిల్లర్లు, స్లాబులను నిర్మించి ప్రమాద ఘటన జరిగేందుకు కారణమయ్యారు. వేగంగా నిర్మాణ పనులు చేపట్టడం వల్ల నాలుగో అంతస్తు స్లాబు వేస్తుండగా నిర్మాణం కుప్పకూలింది. ఈ క్రమంలో ఇద్దరు కార్మికులు చనిపోయారు. శ్రీనివాసనగర్‌లో హైడ్రాలిక్ జాకీలను ఉపయోగించి 3 అంతస్తుల బిల్డింగ్‌ను పైకి లేపే ప్రయత్నం విఫలమైంది. అది 25 ఏళ్ల నాటి నిర్మాణం. రోడ్డుకన్నా కిందకు ఉండటం వల్ల వర్షపునీరు ఇంట్లోకి చేరేది. జాకీలతో పునాదిని మూడు అడుగులు పైకి లేపాలని యజమాని ప్రయత్నం చేయగా ప్లాన్ బెడిసికొట్టింది. బిల్డింగ్ 10డిగ్రీల మేర పక్కకు ఒరిగడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. పోలీసులు వెంటనే జేసీబీ యంత్రాలను తెప్పించి భవనాన్ని పూర్తిగా కూల్చారు.
అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు.. కొమ్ముకాస్తున్న ప్రజాప్రతినిధులు..!