Fire Accident in Shivarampalli: హైదరాబాద్ నగర శివారు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివారాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీ లక్ష్మీ క్లాత్ టెక్స్టైల్స్ దుకాణంలో దురదృష్టవశాత్తు భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించడంతో కాలనీ వాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. విద్యుదాఘాతంతో ప్రమాదం సంభవించినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ భారీ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగనందున అందరు ఊపిరి పీల్చుకున్నారు. సుమారు రూ.25లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇలాంటి అగ్ని ప్రమాదాల నుంచి కాపాడుకోవడానికి వ్యాపారం చేసే షాపులు ఫైర్ సేఫ్టీకి సంబంధించిన పరికరాలను భవనాలకు బిగించుకోవాలని పోలీసులు సూచించారు. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు చెలరేగకుండా అదుపులోకి తీసుకోవచ్చని చెప్పారు. లేదంటే భారీగా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం లాంటివి సంభవిస్తాయని చెబుతున్నారు. పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటప్పుడు ఆ భవనాలకు వద్దకు అగ్నిమాపక వాహనాలు వెళ్లే వసతి కచ్చితంగా ఉండేలా చూసుకోవాలని, అలా ఉంటేనే కార్యకలాపాలు కొనసాగించాలని సున్నితమైన హెచ్చరికతో చెప్పారు. లేదంటే మంటలు త్వరగా చుట్టు పక్కల భవనాలకు వ్యాపించి తీవ్రమైన ప్రాణ, ధన, ఆస్తి నష్టం చేకూరుస్తుందని తెలిపారు. అగ్ని నిరోధక యంత్రాలను తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలన్నారు.