భాగ్యనగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేలా మరో మెట్రో మార్గం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఎల్బీనగర్- మియాపూర్, నాగోల్-రాయదుర్గం మధ్య సేవలందిస్తున్న మెట్రో... మరింత విస్తరించింది. హైదరాబాద్‌లో ప్రధాన బస్‌స్టేషన్లైన ఎంజీబీఎస్ - జేబీఎస్ మధ్య 11 కిలోమీటర్ల పొడవైన మార్గాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. జేబీఎస్-పరేడ్ గ్రౌండ్ స్టేషన్ నుంచి ఎంజీబీఎస్ వరకు ముఖ్యమంత్రి మెట్రో రైల్‌లో ప్రయాణించారు. సుమారు 18 నిమిషాల్లో గమ్యాన్ని చేరుకున్నారు.
9 స్టేషన్లు
మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులో ప్రతిపాదించిన 72 కిలోమీటర్ల మార్గంలో 69కిలోమీటర్ల మేర మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఎంజీబీఎస్ - జేబీఎస్ మార్గం పూర్తికావడంతో దేశంలోనే రెండో అతిపెద్ద నెట్‌వర్క్‌గా హైదరాబాద్ మెట్రో ఘనతను సొంతం చేసుకుంది. 11 కిలోమీటర్ల పొడవైన ఈ రూట్లో 9 స్టేషన్లు ఉన్నాయి. జూబ్లీ బస్ స్టేషన్, సికింద్రాబాద్ వెస్ట్, గాంధీ ఆసుపత్రి, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్‌బజార్, ఎంజీబీఎస్ స్టేషన్లుంటాయి. ఈ మార్గంలో కేవలం 16 నిమిషాల్లో ప్రయాణికులు ఎంజీబీఎస్ నుంచి జేబీఎస్ చేరుకోవచ్చు.
ఎన్నో ప్రత్యేకతలు
ఎంజీబీఎస్, జేబీఎస్ స్టేషన్ల నిర్మాణంలో పలు ప్రత్యేకతలున్నాయి. 58 పిల్లర్లు, 6 గ్రిడ్స్‌తో ఎంజీబీఎస్ స్టేషన్‌ను నిర్మించారు. మెట్రో రైలు ప్రాజెక్టులో అత్యంత ఎత్తయిన స్టేషన్‌గా జేబీఎస్ మెట్రో స్టేషన్ నిలవనుంది. ఐదంతస్తుల ఎత్తులో నిర్మించారు. సికింద్రాబాద్ వైఎంసీఏ కూడలి వద్ద గతంలో నిర్మించిన పైవంతెన ఉంది. దానికి సమాంతరంగా నాగోల్-రాయదుర్గం మెట్రో మార్గాన్ని నిర్మించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రెండు నిర్మాణాలపై నుంచి ఎంజీబీఎస్ - జేబీఎస్ ట్రాక్‌ను వేశారు. 63 అడుగుల ఎత్తులో రైలు ప్రయాణం ప్రయాణికులకు గొప్ప అనుభూతి ఇవ్వనుంది.
హైటెక్ సిటీ వెళ్లే నారాయణగూడ చుట్టుపక్కల ప్రజలకు... జేబీఎస్ వెళ్లే ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్ వాసుల ప్రయాణకష్టాలు ఎంజీబీఎస్ - జేబీఎస్ మెట్రో మార్గంతో తీరనున్నాయి. జిల్లాల నుంచి వచ్చే ప్రయాణికులకు... నగరంలోని ప్రధాన ప్రాంతాలకు చేరుకునే వెసులుబాటు లభించనుంది.
ఇదీ చూడండి: మెట్రో ప్రారంభోత్సవంలో అరుదైన దృశ్యం...