దిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రగతి భవన్లో ఆర్టీసీ సమ్మెపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో సహా పలువురు సీనియర్ అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులతో జరిగిన చర్చల వివరాలను సీనియర్ ఐఎఎస్ అధికారుల కమిటీ ప్రభుత్వానికి నివేదించింది. కార్మికుల డిమాండ్లను పరిశీలించి, పరిష్కరించడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందనే విషయాన్ని తెలిపినప్పటికీ.. కార్మిక సంఘాల నాయకులు సమ్మె కొనసాగించడానికే నిర్ణయించుకున్నట్లు అధికారులు వివరించారు.
సమ్మె.. చట్ట విరుద్ధం
ఆర్టీసీ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో సంస్థకు నష్టం కలిగించే విధంగా యూనియన్లు సమ్మెకు పిలుపునివ్వడం పట్ల ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. సమ్మెను నిషేధిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసినా.. ఉల్లంఘించడం చట్ట విరుద్ధమని అధికారులు అభిప్రాయపడ్డారు. చట్ట వ్యతిరేకంగా సమ్మె చేస్తే కార్మికులను ఉద్యోగాల్లోంచి తొలగించే అధికారం సంస్థకు ఉందని చెప్పారు. సమ్మె విషయంలో అధికారులు చట్ట ప్రకారమే నడుచుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
ఇక చర్చలు ఉండవు..
శనివారం సాయంత్రం 6 గంటల లోగా విధుల్లో చేరిన వారిని మాత్రమే ఆర్టీసీ ఉద్యోగులుగా గుర్తించాలని.. మిగతా వారిని తమంతట తాము ఉద్యోగాలు వదులుకున్న వారిగానే పరిగణించాలని సీఎం ఆదేశించారు. ఆర్టీసీ యూనియన్ నాయకుల ఉచ్చులో పడి.. కార్మికులు సంస్థకు నష్టం చేయవద్దని, ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని సీఎం సూచించారు. కార్మికుల డిమాండ్లపై ఇకపై ఎలాంటి చర్చలు ఉండవని స్పష్టం చేశారు. ఆర్టీసీని కాపాడడానికి ప్రభుత్వం ఎంతో చేసిందని.. కానీ కార్మికులే ఆర్టీసీని ముంచే పని చేస్తున్నారని.. ఈ పరిస్థితుల్లో సంస్థను కాపాడడం కష్టమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
7 వేలకు పైగా బస్సులు..
సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆర్టీసీలో 10 వేల బస్సులు నడుస్తున్నాయని.. ఇందులో 2,100 అద్దెకు తీసుకున్న బస్సులని అధికారులు చెప్పారు. మరో 5 వేల మంది తాత్కాలిక డ్రైవర్లుగా చేయడానికి ముందుకు వచ్చారన్నారు. 7వేలకు పైగా బస్సులు నడపడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఆర్టీసీలో మైలేజ్ అయిపోయిన 2,600 బస్సుల స్థానంలో అద్దె బస్సులు తీసుకోవాలని.. శనివారం ఇందుకోసమే నోటిఫికేషన్ జారీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
కాస్త ఉదారంగా వ్యవహరించండి..
ప్రజల అసౌకర్యాన్ని వీలయినంత తగ్గించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి బస్సులు తెప్పించాలని కేసీఆర్ సూచించారు. ఆటోలు, జీపులు, ఇతర ప్రైవేటు వాహనాల ఆపరేషన్లపై కాస్త ఉదారంగా అధికారులకు సూచించారు. ప్రైవేటు వాహనాలకిచ్చే పర్మిట్ రుసుంలో 25 శాతం రాయితీ ఇవ్వాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సమ్మెలో పాల్గొనకుండా విధులు నిర్వహించే ఉద్యోగులు, కార్మికులకు తగిన భద్రత కల్పించాలని డీజీపీని సీఎం ఆదేశించారు. డిపోల వద్ద భద్రత కల్పించి.. బస్సుల రాకపోకలకు ఇబ్బంది కలిగించే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు.
ఇవీ చూడండి: నేటి నుంచి ఆర్టీసీ సమ్మె... ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రభుత్వం!