ఎన్నికల్లో గెలుపోటములు సహజమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఓడినంత మాత్రాన ప్రజలు వ్యతిరేకించినట్టా అని ప్రశ్నించారు. నాగార్జునసాగర్‌లో భాజపాకు డిపాజిట్ కూడా రాలే అని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో గెలుపోటములనేవి వస్తుంటాయి 2018 ఎన్నికల్లో భాజపా అభ్యర్థులు 107 చోట్ల ధరావత్తు కోల్పోయిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. మిత్రపక్షంతో కలుపుకొంటే 110 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకుందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రగతి భవన్ వేదికగా భాజపాపై తనస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల విషయంలో తన బాధ్యతను విస్మరిస్తోందని సీఎం కేసీఆర్ విమర్శించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం రోజుకోమాట చెప్తోందని మండిపడ్డారు. ధాన్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసే అధికారం రాష్ట్రాలకు లేదని తెలిపారు. ధాన్యం సేకరణ, నిల్వ, ఎగుమతి వంటి అంశాలు కేంద్రం పరిధిలో ఉన్నాయని సీఎం స్పష్టం చేశారు.
రైతులతో పంట మార్పిడి చేయించాలని కేంద్రం చెప్పిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రమే అనేక కొర్రీలు పెడుతోందని ఆరోపించారు. యాసంగి ధాన్యంతో తాలు, నూకలు ఎక్కువగా వస్తాయని సీఎం తెలిపారు. యాసంగి ధాన్యం నాణ్యతగా ఉండటం లేదని కేంద్రమే చెప్తోందని విమర్శించారు. యాసంగిలో ముడిబియ్యం మాత్రమే కొంటామని.. బాయిల్డ్ రైస్ కొనలేమని చెబుతున్నారని మండిపడ్డారు. భవిష్యత్‌లో బాయిల్డ్ బియ్యం ఇవ్వబోమని లేఖ ఇవ్వాలని ఎఫ్‌సీఐ అడిగిందని చెప్పారు. ఈ ఏడాదిలో ఎంత ధాన్యం కొంటారో చెప్పాలని అడిగితే ఇప్పటివరకు సమాధానం చెప్పలేదని ఎద్దేవా చేశారు. బాయిల్డ్ రైసు కొనుగోలు చేసేది లేదని కేంద్రం ఖరాఖండిగా చెప్పిందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
ఇదీ చూడండి: