రాష్ట్రంలో అన్ని పంటలు పండటానికి అనుకూల వాతావరణం ఇక్కడ ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. పంటల ఉత్పత్తిలో తెలంగాణ చరిత్ర సృష్టిస్తోందని, దేశానికి, ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదుగుతోందని ధీమా వ్యక్తం చేశారు. నీటిపారుదల ప్రాజెక్టులు చాలా చురుగ్గా సాగుతున్నాయని, ప్రాజెక్టుల ఫలాలు ఇప్పటికే మనం చూస్తున్నామన్నారు. బలమైన ఈదురుగాలులు, వరదల వంటి విపత్తులు తెలంగాణలో తక్కువే అన్నారు. కొన్ని రకాల అరుదైన పండ్లకు తెలంగాణ కేంద్రంగా ఉందని వివరించారు.
అందరూ అనుసరిస్తున్నారని..
తెలంగాణ అవతరించాక దేశ చరిత్రలో లేనివిధంగా రైతు ప్రోత్సాహకాలు, అమలు చేసే పథకాలను అందరూ అనుసరిస్తున్నారని అన్నారు. రైతు బీమా రూ.700 కోట్ల నుంచి రూ.1,100 కోట్లకు పెంచామన్నారు. 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ కేవలం తెలంగాణలోనే ఉందన్నారు.
పంటలు పండించేందుకు విప్లవాత్మక చర్యలు
వేలాది పాడిపశువులు పంపిణీ చేసి ప్రోత్సాహకాలు అందిస్తున్నామని, అధునాతన పద్ధతుల్లో పంటలు పండించేందుకు విప్లవాత్మక చర్యలు చేపట్టామన్నారు. 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణదే అన్నారు. కల్తీ విత్తన విక్రేతలపై ఒక్క తెలంగాణలోనే పీడీ యాక్టు అమలవుతోందని స్పష్టం చేశారు. రూ.350 కోట్లతో క్లస్టర్లలో రైతు వేదికలు ఏర్పాటు చేస్తున్నామని, అన్నదాతలకు ప్రోత్సాహకాలు, రక్షణ కల్పనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉందన్నారు. పీడీఎస్ కింద చరిత్రలో ఎన్నడూ లేనంత పంపిణీ చేస్తున్నామని, రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందన్నారు. గ్రామాల్లో రైతుల వద్దకు వెళ్లి మద్దతు ధరకు ప్రభుత్వమే కొంటోందని స్పష్టం చేశారు.
పత్తి విస్తీర్ణం పెంచుదాం
వరిలో తెలంగాణ సోనా రకాన్నే రైతులు వేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అభ్యుదయ వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని తెలిపారు. అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అనే పాతవిధానం మారాలన్నారు. కాళేశ్వరం నీళ్లు వచ్చినందున వ్యవసాయ విస్తీర్ణం పెరుగుతుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. గత ఏడాది 53లక్షల ఎకరాల్లో పత్తి పండించారని.. ఈసారి 70 లక్షల ఎకరాల్లో పండించాలని ముఖ్యమంత్రి సూచించారు.
ఇదీ చూడండి : రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు తిరుగుతాయి: సీఎం