BRS in Maharashtra: మహారాష్ట్రలో అవినీతిరహిత పాలన అందించడమే బీఆర్ఎస్ లక్ష్యమని.. ఆ రాష్ట్రంలో ఎవరితోనూ పొత్తు ఉండదని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అక్కడ త్వరలో జరగనున్న జిల్లా పరిషత్ ఎన్నికలపై దృష్టి సారించిన కేసీఆర్.. తెలంగాణ భవన్‌లో ఆ రాష్ట్ర నాయకులతో చర్చించారు. ప్రతి గ్రామంలో కమిటీతో పాటు.. రైతు, విద్యార్థి, యువజన, మహిళా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ ఇలా 9 కమిటీలు వేయాలన్నారు. తెలంగాణ మోడల్ అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ నేతలు రోజుకు కనీసం 5 గ్రామాలు తిరిగి రైతుబంధు, రైతు బీమా, దళితబంధు పథకాలపై ప్రచారం చేయాలని వివరించారు.
ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు.. ఒంటరిగా బరిలోకి: మరాఠీ భాషలో పాటలు, పార్టీ ప్రచార సామాగ్రి సిద్ధమవుతోందని చెప్పారు. రానున్నరోజుల్లో మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభంజనం ఖాయమని ఆ విషయంలో ఎవరికీ అనుమానం అక్కర్లేదని పార్టీ నేతలకు కేసీఆర్ తెలిపారు. కొత్తపార్టీని అందరూ వింతగానే చూస్తారని.. పార్టీ సిద్ధాంతం, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధిని చూశాక ప్రజలు ఆసక్తి, అభిమానం పెంచుకుంటారని వివరించారు. గొప్ప సామాజిక, సాంస్కృతిక, రాజకీయ చైతన్యం కలిగిన మహారాష్ట్రలో పరిపాలన రోజు రోజుకూ దిగజారిపోతోందని సీఎం గుర్తుచేశారు. ఇన్నాళ్లూ ప్రభుత్వాలను నడిపిన మహారాష్ట్ర పార్టీలు అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయన్న విషయాన్ని ప్రజలు గ్రహించారన్నారు. మహారాష్ట్రలో అవినీతి రహిత పాలన అందించటమే బీఆర్ఎస్ లక్ష్యమన్న కేసీఆర్.. అక్కడ ఏ పార్టీతోనూ పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు.
మహారాష్ట్రలో బీఆర్ఎస్ గాలి..: మహారాష్ట్ర ప్రజల జీవితాల్లో గుణాత్మాక అభివృద్ధి తీసుకువచ్చేందుకు బీఆర్ఎస్.. అహర్నిషలు కృషి చేస్తుందని బీఆర్ఎస్ అధినేత తెలిపారు. మహారాష్ట్ర ప్రజల ఆదరాభిమానాన్ని చూరగొంటున్నామని అక్కడి పల్లెల్లోనూ బీఆర్ఎస్పై చర్చ జరుగుతోందని తెలిపారు. తెలంగాణ ప్రగతి మోడల్ మహారాష్ట్ర ప్రజలను అమితంగా ఆకట్టుకుంటున్నదన్న ఆయన మహారాష్ట్రలో బీఆర్ఎస్ గాలి వీస్తోందన్నారు. తొలి దశలో నాగపూర్, ఔరంగాబాద్, పుణె, ముంబయిలో బీఆర్ఎస్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఒకప్పుడు మహారాష్ట్ర నుంచి నేర్చుకున్న తాను.. ఇప్పుడు ఆ రాష్ట్రానికి చెప్పాల్సి వస్తోందని అన్నారు.
BRS Party In Maharashtra: తెలంగాణలో షో చేసేందుకు 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెట్టలేదని.. అంబేడ్కర్ సిద్ధాంతాన్ని ఆచరించడం.. ఆయన ఆశించిన సమాజాన్ని నెలకొల్పటమే బీఆర్ఎస్ లక్ష్యమని కేసీఆర్ స్పష్టం చేశారు. దళితులు, మహిళలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయనంత వరకు దేశం ముందుకు సాగదని గుర్తుచేశారు. మహారాష్ట్ర రాత మార్చేందుకు కొత్త రక్తం రాజకీయాల్లోకి వస్తోందని వారిని ఆహ్వానిద్దామని కేసీఆర్ సూచించారు.
ఇవీ చదవండి: