పల్లె ప్రగతి తరహాలో త్వరలోనే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. పురపాలకశాఖలో ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 141 పట్టణ స్థానిక సంస్థలకు నిధులు సమకూరుస్తామన్నారు. హైదరాబాద్ నగరానికి ప్రతినెలా రూ.78 కోట్లు, మిగతా పట్టణాలు, నగరాలకు రూ.70 కోట్లు విడుదల చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ కేటాయింపులతో పాటు.. స్థానికంగా సమకూరే నిధులతో పట్టణాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
జాగ్రత్త వహించాలి
దిల్లీ తరహాలో సముద్రం ఒడ్డున లేని నగరాల్లో కాలుష్యం పెరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సీఎం తెలిపారు. నివాసయోగ్యమైన నగరాల జాబితాలో ముందున్న హైదరాబాద్ నగరాన్ని నిర్లక్ష్యం చేస్తే కాలుష్య కాసారం కాకతప్పదని హెచ్చరించారు. ఇప్పటి నుంచే జాగ్రత్త వహించి హైదరాబాద్ నగరం లోపల, చుట్టూ ఉన్న లక్షా 60వేల ఎకరాల అటవీ భూమిలో దట్టమైన అడవులు పెంచాలని తెలిపారు. వనస్థలిపురం హరిణవనస్థలిని కేబీఆర్ పార్కులాగా తయారు చేయాలని, నగరంలో కాలుష్య నివారణకు ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని సూచించారు.
ఎలక్ట్రానిక్ వాహనాల సంఖ్య పెంచాలి
డీజిల్ వాహనాలు తగ్గించి, ఎలక్ట్రానిక్ వాహనాల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. భాగ్యనగరం కాలుష్యమయం కాకుండా చూసుకోవాలనే స్పృహ ప్రతి ఇంట్లో కలిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సంబంధిత కథనాలు: కలెక్టర్లకు సీఎం కేసీఆర్ నిర్దేశించిన బాధ్యతలు ఇవే!