మంచి చదువుతోనే పేదల బతుకులు మారతాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగనన్న విద్యా దీవెన పథకం ప్రారంభించిన ఆయన.. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, విద్యార్థుల తల్లులతో మాట్లాడారు. విద్యాదీవెనలో భాగంగా 2 పథకాలు తీసుకొచ్చామన్న సీఎం.. విద్యార్థులకు బోర్డింగ్, లాడ్జింగ్, పూర్తి రీయింబర్స్మెంట్ ఇస్తామని తెలిపారు.
పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి.. ఒక్క చదువేనన్న సీఎం.. మార్చి 31 వరకు ఉన్న పూర్తి బకాయిలను చెల్లిస్తామని పేర్కొన్నారు. 2018 – 19 లో గత ప్రభుత్వం పెట్టిన రూ.1880 కోట్లు, ఈ ఏడాదికి సంబంధించి ఒక్క పైసా కూడా బకాయి లేకుండా ఇస్తామని స్పష్టం చేశారు. 2020 – 21లోనూ ప్రతి త్రైమాసికం తర్వాత తల్లుల ఖాతాలో డబ్బులు వేస్తామని సీఎం జగన్ వెల్లడించారు. కళాశాలల్లో సదుపాయాలు లేకపోతే 1902కు తల్లులు ఫోన్ చేయవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు.