సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్లో ఉప సభాపతి తీగుళ్ల పద్మారావుగౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం బోనాల వేడుకలు వైభవంగా జరిగాయి. మోండా మార్కెట్ తాకర బస్తీ న్యూ అశోక్‌నగర్‌లో పద్మారావు గౌడ్ కుటుంబం నిర్మించిన శ్రీ ముత్యాలమ్మ దేవాలయంలో బోనాల వేడుకలను పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసభ్యులు ఈ పూజల్లో పాల్గొన్నారు.
అనంతరం పద్మారావుగౌడ్ నివాసంలో విందుకు హాజరయ్యారు. ముఖ్యమంత్రి సతీమణి కల్వకుంట్ల శోభ, పార్లమెంట్ సభ్యులు జోగినపల్లి సంతోశ్‌కుమార్, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో పాటు పలువురు నేతలు, అధికార, అనధికార ప్రముఖులు విందులో పాల్గొన్నారు.
అంతకుముందు తీగుళ్ల మౌనిక గౌడ్ ఆధ్వర్యంలో తీగుళ్ల కుటుంబసభ్యులు తెల్లవారుజామునే ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు.
ప్రత్యేక ఆకర్షణగా పోతరాజుల నృత్యాలు..
మరోవైపు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల సందర్భంగా పోతరాజుల విన్యాసాలు, ఫలహారం బండ్ల ఊరేగింపులు ఆకట్టుకున్నాయి. ప్యారడైజ్, సికింద్రాబాద్, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేకంగా అలంకరించిన బండ్లలో అమ్మవారి చిత్ర పటాన్ని ఊరేగించారు. పోతరాజుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అర్ధరాత్రి కూడా భక్తులు పెద్ద ఎత్తున ఉత్సవాల్లో పాల్గొన్నారు.