బడ్జెట్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్పొరేట్ శక్తులకు ఏ రకంగా లబ్ధి చేకూరాలనే విధంగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినట్లుగా ఉందని ఆయన ఆరోపించారు. సామాన్యులను కేంద్రం పట్టించుకోలేదని విమర్శించారు. జాతీయం చేసిన బ్యాంకులను కూడా ప్రైవేటీకరిస్తామనడం దుర్మార్గమన్నారు. దేశంలో ఉన్న ఇన్స్యూరెన్స్ కంపెనీలు భవిష్యత్‌లో విదేశీయుల చేతుల్లోకి పోయే విధంగా దారిని సుగమం చేసిన బడ్జెట్‌గా భట్టి అభివర్ణించారు.
ఎన్నికల్లో లబ్ధి పొందడానికి బడ్జెట్‌ను వాడుకున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని మరోసారి నిరాశకు గురిచేశారన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశాలపై కూడా మాట్లాడలేదన్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే తెరాస, భాజపా ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ బడ్జెట్ తమను నిరాశ, నిస్పృహలకు గురిచేసిందన్నారు.
ఇదీ చదవండి: దేశాన్ని మోదీ ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్తున్నారు : డి. రాజా