Bhatti Vikramarka: కొత్తగూడెం పాల్వంచలో రామకృష్ణ కుటుంబం రాజకీయ ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకుందని ఆరోపించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. మృతుడి సెల్ఫీ వీడియో చూసి రాష్ట్ర ప్రజలు చలించిపోయారని పేర్కొన్నారు. కొత్తగూడెంలో జరిగిన ఈ సంఘటనలో పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో పోలీస్ శాఖ పని చేస్తుందా అని నిలదీశారు. రెవెన్యూ, పోలీస్ వ్యవస్థలు ప్రజలకు సేవ చేయడం మరిచాయని ఆరోపించారు. రాను రాను పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోందని ధ్వజమెత్తారు. ప్రజలు, ప్రతిపక్షాలు పోరాటం చేయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
మూడు రోజులైనా..
వనమా రాఘవను తక్షణమే అరెస్టు చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. పాల్వంచలో కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి మూడు రోజులైనా.. పోలీస్ యంత్రాంగం ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థను అధికార పార్టీ అవసరాలకే వాడుకుంటున్నారని భట్టి ఆరోపించారు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలన్నీ కూడా కొత్తగూడెం నియోజకవర్గ బంద్‌కు పిలుపునిచ్చాయని తెలిపారు. సంఘటన స్థలానికి తాము వెళ్లి చూశామని....అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మూడో పాప చనిపోయే ముందు ఆ పాపని కాపాడాలని సర్కార్‌ను కోరామని, ఎయిర్ అంబులెన్సు పంపాలని సీఎస్‌ను, కలెక్టర్‌ను అడిగినా స్పందన లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగూడెం ప్రజలు భయం భయంగా బతుకుతున్నారన్న సీఎల్పీ నేత భట్టి.. తక్షణమే అఖిలపక్ష సమావేశం పెట్టాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోనట్లయితే ముఖ్యమంత్రిని, డీజీపీని, గవర్నర్‌లను కలుస్తామని.. అవసరమైతే కేంద్ర హోంమంత్రిని కూడా కలుస్తామని తెలిపారు
పట్టించుకోకపోతే నిరసనలు..
ప్రభుత్వం పట్టించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతామని భట్టి విక్రమార్క హెచ్చరించారు. ప్రజలంతా స్వేచ్ఛాయుత తెలంగాణను కోరుకుంటున్నారన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. అధికార పార్టీ కోసం కాకుండా ప్రజల కోసం పోలీసులు పనిచేయాలని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో ప్రజాస్వామ్యానికి నష్టం వాటిల్లుతోందని భట్టి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు.
పాల్వంచలో కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి మూడు రోజులైంది. మూడ్రోజులైనా పోలీస్ యంత్రాంగం ఏం చేస్తోంది?. పోలీస్ వ్యవస్థను పార్టీ అవసరాలకే వాడుకుంటున్నారు. కొత్తగూడెం నియోజకవర్గ బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతాం. ప్రజలంతా స్వేచ్ఛాయుత తెలంగాణను కోరుకున్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం.
-భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
ఇదీ చదవండి: