‘కరోనా వేళ.. శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి కీలక పాత్ర పోషిస్తోంది. సూక్ష్మ పోషకాలైన విటమిన్లు, మినరల్స్ వ్యాధి నిరోధక శక్తి పెంచడంలో ఉపయోగపడతాయి. ముఖ్యంగా విటమిన్ సి, డి, జింక్ తగిన మోతాదులో తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 20 ఏళ్లు దాటిన వారు నెల రోజులపాటు వినియోగించాలని సూచిస్తున్నారు. ఇది తెలియక కొందరు దీర్ఘకాలం వాడేస్తున్నారు. వైద్యుల సూచన లేకుండా ఇతర విటమిన్లతోపాటు ఎక్కువ మోతాదులో తీసుకుంటున్నారు. తద్వారా మేలు కంటే కీడే ఎక్కువని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిపుణుల సూచనల మేరకు మాత్రమే విటమిన్లు వాడితే ఇబ్బంది ఉండదన్నారు.
గతంలో విటమిన్ సి, డి, జింక్ గోలీల అమ్మకాలు చాలా తక్కువగా ఉండేవి. వైద్యులు సూచిస్తేనే కొనేవారు. ప్రస్తుతం వైద్యుల చీటీ లేకుండానే కావాలని అడుగుతున్నారు. సి, డి విటమిన్ గోలీలకు కొరత ఏర్పడుతోంది. చాలామంది ముందు జాగ్రత్తగా వీటిని కొని మింగేస్తున్నారు. డిమాండ్ దృష్ట్యా హోల్‌సెల్‌లో సరఫరా పెంచారు.’
- ఖైరతాబాద్‌లోని ఓ ఔషధ షాపు యజమాని.
ఔషధ విక్రయాలు, సరఫరాలో కీలకమైన హైదరాబాద్‌లో గతంలో మల్టీ విటమిన్ల వాటా 5-10 శాతం ఉంటే.. కరోనా సమయంలో అది 30-40 శాతం పెరిగింది. మల్టీ విటమిన్లు ఎక్కువగా వినియోగించడమే ఇందుకు కారణం.
- ఔషధ సరఫరా రంగంలోని నిపుణులు
- విటమిన్ సి: పెద్దలకైతే రోజూ 65-95 మి.గ్రా. తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే అనర్థాలు వస్తాయి.
- విటమిన్ ఎ: కొవ్వుల్లో కరుగుతుంది. మోతాదు కంటే ఎక్కువ వాడితే కొన్నిసార్లు విషపూరితంగా మారుతుంది. జుత్తు రాలిపోవడం, కాలేయం దెబ్బతినడం, ఎముకల్లో నొప్పి, దృష్టి లోపం, పొడి చర్మం లాంటి సమస్యలు తలెత్తవచ్ఛు
- జింక్: పరిమితికి మించి వాడితే అజీర్ణం, అతిసారం, వాంతులు వస్తాయి. అధిక మోతాదులో దీర్ఘకాలం తీసుకుంటే కాపర్ లోపం ఏర్పడుతుంది. చేతులు, కాళ్లు తిమ్మిర్లు పట్టి నాడీ సమస్యలకు దారి తీస్తుంది.
- విటమిన్ డి: అధికంగా తీసుకోవడం హానికరం. రోజుకు 4 వేల ఐయూ (ఇంటర్నేషనల్ యూనిట్లు) కంటే ఎక్కువ వాడితే వాంతులు, మలబద్ధకం ఇతర సమస్యలతోపాటు కిడ్నీపై ప్రభావం పడుతుంది.
- విటమిన్ ఇ: మోతాదు కంటే ఎక్కువ వాడితే రక్తం గడ్డకట్టే సామర్థ్యానికి ఆటంకం ఏర్పడుతుంది.
- బి6: ఎక్కువైతే నరాల సమస్య. విటమిన్ బి3 కూడా అంతే. మోతాదు మించితే వికారం, కాలేయం విడుదల చేసే ఎంజైమ్ స్థాయిలు పెరగడం వంటివి కనిపిస్తాయి.
ఇదీ చూడండిః కరోనా వేళ రక్తం దొరక్క తలసేమియా బాధితుల ఆవేదన