రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న వేళ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సికింద్రాబాద్ జోన్ కార్యదర్శి మల్లేశ్ మండిపడ్డారు. సికింద్రాబాద్లోని రేతిఫైల్ బస్టాండ్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కరోనాను నివారించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మల్లేశ్ విమర్శించారు. కార్మికులకు లాక్డౌన్ కాలానికి సంబంధించి పూర్తి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగుల తొలగింపుపై ప్రైవేటు కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక్కో కార్మికునికి పది కిలోల చొప్పున ఆరు నెలల పాటు సన్న బియ్యం అందించాలన్నారు. ప్రతీ కార్మిక కుటుంబానికి నెలకు రూ.7500 చొప్పున మూడు నెలలపాటు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజల జీవన మనుగడపై భారం మోపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొగ్గు చూపుతున్నాయని మండిపడ్డారు. ఈ విషయంలో పెట్రోల్ డీజిల్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు పెంచడంపై పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.