ఆంధ్రప్రదేశ్లోని అమరావతి అసైన్డ్ భూముల అంశంలో మాజీమంత్రి నారాయణను నిందితుడిగా చేర్చిన సీఐడీ... బుధవారం ఆయన నివాసాలు, కశాశాలల్లో సోదాలు నిర్వహించింది. నిన్న ఉదయం 11 గంటలకు నెల్లూరు చింతారెడ్డిపాలెంలోని నారాయణ నివాసానికి రెండు బృందాలుగా వెళ్లిన 8 మంది అధికారులు... దాదాపు 7 గంటలపాటు సోదాలు చేశారు. ఇంటి బయట ఉన్న సామాన్య ప్రజలతో పాటు నారాయణ ఆసుపత్రి సిబ్బందిని ఇంట్లోకి తీసుకెళ్లి ప్రశ్నించారు. ఆ సమయంలో వారి సెల్ ఫోన్లు, వాహనాల తాళాలు తీసుకున్నారు.
నారాయణ ఇంట్లో పనిచేసే మహిళను గంటకు పైగా విచారించారు. తాను చదువుకోలేదని, పని చేసుకుని వెళ్లడం తప్ప ఏ విషయాలూ తెలియవని ఆమె చెప్పినట్లు సమాచారం. హరినాథపురంలోని నారాయణ జూనియర్ కళాశాల సిబ్బందిని అదికారులు ప్రశ్నించారు. సాయంత్రం 6 గంటల వరకు ఎవర్నీ బయటకి పోనివ్వకుండా, ఇతరుల్ని లోనికి రానివ్వకుండా సోదాలు సాగించారు. పని పూర్తయ్యాక అధికారులు ఆటోల్లో వెళ్లిపోయారు. వివరాలు అడిగేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించినా స్పందించలేదు. హైదరాబాద్‌లోని నారాయణ నివాసం, విజయవాడలోని పలు ప్రాంతాల్లోనూ సీఐడీ సోదాలు చేసినట్లు సమాచారం.
అంతకుముందు హైదరాబాద్‌లో నారాయణ భార్యకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. మొదట మాదాపూర్‌లోని కార్యాలయానికి వెళ్లగా ఆయన అందుబాటులో లేకపోవడంతో... కేపీహెచ్బీ కాలనీ నివాసానికి వెళ్లారు. అక్కడా నారాయణ లేకపోడంతో... ఆయన భార్య రమాదేవికి నోటీసు అందించారు. ఈ నెల 22న ఉదయం 11 గంటకు విజయవాడ సత్యనారాయణపురంలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని సూచించారు. లేదంటే అరెస్టు చేయాల్సి ఉంటుందన్నారు.
నారాయణ ప్రస్తుతం నగరంలో లేరని, ఆయన తరపున నోటీసు తీసుకుంటున్నట్లు ఆయన భార్య తెలిపారు. నిర్ణీత తేదీలో దర్యాప్తు అధికారి ఎదుట హాజరవుతారని చెప్పారు. విచారణకు సహకరించాలని, తెలిసిన ఆధారాన్ని అందించాలని నారాయణకు ఇచ్చిన నోటీల్లో అధికారులు పేర్కొన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా దర్యాప్తులో జోక్యం చేసుకోకూడదని, కేసు వివరాలు తెలిసిన వ్యక్తులతో సంప్రదింపులు జరపరాదని, ప్రభావితం చేయరాదని నిర్దేశించారు.
అమరావతి అసైన్డ్ భూముల కేసులో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి ఇప్పటికే నోటీసులివ్వగా... ఆయన సోదరి కె.హైమావతి ఇంట్లో చంద్రగిరి పోలీసులు హల్‌చల్ చేయడం కలకలం సృష్టించింది. పోలీసులమంటూ చంద్రగిరి మండలం కందులవారిపల్లెలో ఉంటున్న హైమావతి ఇంటికి వెళ్లిన కొందరు... అనుమతి లేకుండా లోపలికి వెళ్లారని కాపలాదారు రవి తెలిపారు. లోపల సీసీటీవీ కెమెరాలను చూసి బయటకు వెళ్లారని, పరిసరాలను ఫొటోలు తీశారని చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హైమావతి ఇంటికి వచ్చిన వాళ్లెవరు, ఎందుకు వచ్చారన్న విషయాలపై విచారణ చేయాలని కోరారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను అందించారు. దీనిపై స్పందించిన సీఐ రామచంద్రారెడ్డి... నారావారిపల్లికి చెందిన చదలవాడ సుచరిత ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి గొడవ చేస్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. ఈ విషయమై నారావారిపల్లికి వెళ్లాల్సిన తమ సిబ్బంది... హైమావతి కుమార్తె పేరు సుచరిత కావడంతో పొరపాటున కందులవారిపల్లికి వెళ్లారని చెప్పారు.
- ఇదీ చూడండి: సింగరేణి కార్మికులకు ఉచితంగా కరోనా టీకా