ఉక్రెయిన్‌కు చెందిన యువతి ల్యూబోవ్... హైదరాబాద్‌కు చెందిన ప్రతీక్ గతకొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ జంట ఇటీవలె ఆ దేశంలో పెళ్లి చేసుకున్నారు. రిసెప్షన్‌ను హైదరాబాద్‌లో జరుపుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే వీరి పెళ్లి యుద్ధం ప్రారంభం కావడానికి ముందే జరిగింది. వివాహం తర్వాత ఇండియాకు వచ్చిన ఈ కొత్త జంట... ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకను జరుపుకున్నారు.
నూతన వధూవరులకు రంగరాజన్ ఆశీర్వాదం
ఈ రిసెప్షన్‌కు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు. వెంకటేశ్వర స్వామివారి శేష మాల, శేష వస్త్రం అందించి... ఆశీర్వచనం చేశారు. అనంతరం ఉక్రెయిన్-రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధం త్వరలో ముగియాలని ఆకాంక్షించారు. అందుకోసం ఆలయంలో సోమవారం ఉదయం ప్రత్యేక పూజలు చేసినట్లు వెల్లడించారు.
ఫొటోలు వైరల్
ఈ రిసెప్షన్‌కు ఆయన రావడానికి ఓ కారణం ఉంది. వరుడి తండ్రి ఉస్మానియా యూనివర్సిటీ బయోమెడికల్ ఇంజినీరింగ్ విభాగంలో అర్చకులు రంగరాజన్ స్వామితో కలిసి చదువుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఉక్రెయిన్ వధువు, హైదరాబాదీ వరుడి రిసెప్షన్‌కు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఇదీ చదవండి: రష్యా- ఉక్రెయిన్ కీలక చర్చలు- సంధి కుదిరేనా?