Accident in Play zone at City mall in Hyderabad : ప్రమాదం ఏ వైపు నుంచి పొంచి ఉంటుందో ఊహించడం కష్టం. ముఖ్యంగా చిన్న పిల్లలు ఏ వైపు నుంచి ఏ ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటారో చెప్పడం ఇంకా కష్టం. అనుక్షణం కంటికిరెప్పలా కాపాడుకోకపోతే ఏదైనా జరగొచ్చు. అలా తమ పసిపాపను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు ఆ తల్లిదండ్రులు. ఇవాళ సండే కదా జాలీగా గడుపుదామనుకుని బయటకు తీసుకువెళ్లారు. అప్పటిదాకా కేరింతలు కొడుతూ ఆడుకుంటున్న ఆ చిన్నారికి అంతలోనే అనుకోని ప్రమాదం. ఆ ప్రమాదంతో ఒక్కసారిగా ఆ తల్లిదండ్రుల గుండె ఝళ్లుమంది. తమ చిన్నారి చేతివేళ్లు తెగి పడటం చూసి ఆ తల్లి గుండె ఒక్క క్షణం ఆగినంత పనైంది. తండ్రి మాత్రం వెంటనే స్పందించి ఏరులై పారుతున్న రక్తాన్ని ఆపాడు. హుటాహుటిన తమ గారాల పట్టిని ఆస్పత్రికి తీసుకువెళ్లారు ఆ తల్లిదండ్రులు. ఇంతకీ ఆ పాపకు ఏం ప్రమాదం జరిగిందంటే..?
Play zone Accident in Hyderabad : హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఇబ్రహీంనగర్‌కు చెందిన మెహతా జహాన్ అనే వ్యక్తి తన భార్య మహియా బేగం, ముగ్గురు కుమార్తెలతో కలిసి బంజారాహిల్స్ రోడ్‌నంబర్. 1లో ఉన్న సిటీ సెంటర్ షాపింగ్ మాల్‌కు వెళ్లారు. అక్కడ నాలుగో అంతస్తులో ఉన్న స్మాల్ ప్లే ఏరియా ప్రాంతానికి ముగ్గురు పిల్లలను తీసుకువెళ్లారు. పిల్లలు జాలీగా ఆడుకుంటున్న సమయంలో అక్కడ తెరిచి ఉన్న ఒక యంత్రంలో.. మూడేళ్ల పాప మెహ్విష్ లుబ్నా అకస్మాత్తుగా కుడి చేయి పెట్టింది. దీంతో పాప మూడు చేతివేళ్లు, చూపుడువేలు కొంత భాగం నలిగిపోయాయి. చిన్నారి తల్లిదండ్రులు ఆమెను హుటాహుటిన వైద్యం కోసం యశోద ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పాప కుడి చేతి మూడు వేళ్లను తొలగించారు. పూర్తిగా నలిగిపోయాయని, చేతి వేళ్లను తిరిగి అతికించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
సిబ్బంది నిర్లక్ష్యమే..: సదరు సంస్థపై చిన్నారి తండ్రి బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన జరిగిన సమయంలో స్మాష్ జోన్ సిబ్బంది, మాల్ నిర్వాహకులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. ప్రమాదం జరిగిన తర్వాత కూడా స్మాష్ జోన్‌లో ఆడుకుంటున్న పిల్లలను చూసుకోవడానికి సిబ్బంది అందుబాటులోకి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
సీసీటీవీ ఫుటేజీ తొలగింపు..: "ఈ ఘటన పూర్తిగా స్మాష్జోన్ సిబ్బంది భద్రతా వైఫల్యమే. ప్రమాదానికి కారణమైన యంత్రం వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ కోసం నిర్వాహకులను సంప్రదించినప్పుడు వారు సంఘటనా ప్రాంతంలోని సీసీ కెమెరా కవరేజీని తొలగించారు. ఆ ప్రాంతానికి సంబంధించిన ఫుటేజీ తమ వద్ద లేదని చెప్పారు." అని పాప తండ్రి తెలిపారు. తన కుమార్తెకు జరిగిన నష్టానికి సిటీ సెంటర్ మాల్ మేనేజ్‌మెంట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని బాలిక తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: