Chikoti Praveen Casino Case updates: క్యాసినో వ్యవహారంలో ఈడీ అధికారులు అనంతపురానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి విచారణ ముగిసింది. ఇవాళ సుమారు 10 గంటల పాటు ఆయనను ఈడీ ప్రశ్నించింది. ఫెమా నిబంధనల ఉల్లంఘన, హవాలా చెల్లింపులపై ఈ విచారణ సాగింది. గురునాథ రెడ్డితో పాటు పంజాగుట్ట ఊర్వశి బార్ ఓనర్ యుగంధర్‌ను కూడా ఈడీ అధికారులు ప్రశ్నించారు.
చీకోటి ప్రవీణ్ నేపాల్‌లో ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన క్యాసినోకు గుర్నాథరెడ్డి వెళ్లినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ప్రవీణ్ బ్యాంకు ఖాతాలు పరిశీలించినప్పుడు పలు అనుమానాస్పద ఖాతాల వివరాలు ఆరా తీశారు. భారీగా నగదు ప్రవీణ్ ఖాతాకు బదిలీ అయినట్లు గుర్తించారు. ఆ క్రమంలోనే ఆయా ఖాతాలకు సంబంధించిన వివరాలు సేకరించిన ఈడీ అధికారులు ఒక్కొక్కరిని కార్యాలయానికి పిలిచి ప్రశ్నించారు.
నిన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులు మహేష్, దర్మేంధ్ర యాదవ్‌ను నిన్న 9 గంటల పాటు ప్రశ్నించారు. తెరాస ఎమ్మెల్సీ ఎల్.రమణకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆయన రేపు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. మెదక్ డీసీసీబీ ఛైర్మన్ దేవెందర్ రెడ్డికి సైతం ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
వచ్చే వారం మరికొంత మందిని ఈడీ అధికారులు పిలిచి ప్రశ్నించే అవకాశం ఉంది. నేపాల్‌లో క్యాసినో చట్టబద్ధమే అయినప్పటికీ.. ఇక్కడి నుంచి డబ్బులను హవాలా మార్గంలో అక్కడికి తీసుకెళ్లి క్యాసినో ఆడినట్లు ఈడీ అధికారులు ఆధారాలు సేకరించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి నేపాల్‌కు పలువురు జూద ప్రియులను తీసుకెళ్లినట్లు వివరాలు సేకరించారు. ఇక్కడ చీకోటి ప్రవీణ్‌కు డబ్బులు ఇస్తే కాయిన్లు ఇచ్చాడని.. వాటిని తీసుకెళ్లి నేపాల్‌లో ఇస్తే అక్కడి నిర్వాహకులు నగదు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు.
అక్కడ క్యాసినోలో డబ్బులు గెల్చుకుంటే తిరిగి ఆ నగదును నేపాల్‌లో క్యాసినో నిర్వాహకులు ఇస్తే కాయిన్లు ఇచ్చారని.. వాటిని తీసుకొచ్చి ఇక్కడ నగదుగా మార్చుకున్నట్లు ఈడీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్న అధికారులు విదేశీ మారక నిర్వాహణ చట్టాన్ని ఉల్లంఘించి ఏ మేరకు నగదును తరలించారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
అసలేం జరిగిదంటే: క్యాసినోల ముసుగులో విదేశాలకు నిధుల మళ్లిస్తున్నారన్న ఆరోపణలపై నాలుగు నెలల క్రితం ఈడీ నమోదు చేసిన కేసు మరోమారు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల నుంచి జూద ప్రియులను ప్రత్యేక ప్యాకేజీల ద్వారా విదేశాలకు తీసుకెళుతూ పెద్దమొత్తంలో నిధుల మళ్లింపునకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై పలువురు టూర్ ఆపరేటర్లపై గత జులైలో ఈడీ కేసు నమోదు చేసి పలువురిని విచారించింది. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌కు చెందిన చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి తదితరుల ఇళ్లు, కార్యాలయాల్లో అప్పట్లో సోదాలు నిర్వహించి వారిని విచారించారు.
ఇవీ చదవండి: మళ్లీ క్యాసినో కలకలం.. మంత్రి సోదరులను ప్రశ్నించిన ఈడీ
విచారణలో వారి పేర్లు చెప్పాలని బెదిరిస్తున్నారన్న చీకోటి ప్రవీణ్
క్యాసినో నిర్వహించా.. అందులో తప్పేముంది: చీకోటి ప్రవీణ్
నూతన సచివాలయం నిర్మాణ పనులను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్
శ్రద్ధ హత్య కేసు నిందితుడికి నార్కో టెస్ట్.. మరో ఐదు రోజులు పోలీస్ కస్టడీ