ఎస్సీ సాధికారత పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ ప్రగతి భవన్లో జరిగిన ఈ సమీక్షలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పథకం ఎలా అమలు చేయాలో చర్చించినట్లు తెలుస్తోంది. ఎస్సీ యువత పారిశ్రామిక, సాంకేతిక సహా ఇతర రంగాల్లో స్వయం ఉపాధి పొందేలా ప్రభుత్వం తోడ్పడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు. దళిత సాధికారత పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తామని సీఎం స్పష్టం చేశారు. అర్హులకు నేరుగా ఆర్ధిక సాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సీల్లో అర్హులైన కుటుంబాల గణన జరపాలని అధికారులకు నిర్దేశించారు. అత్యంత పారదర్శకంగా దళారీలు లేని విధానానికి సలహాలు ఇవ్వాలని.. ప్రతిపక్షాలను కోరారు.
నేతలంతా కలిసిరావాలి..
ఎస్సీ సాధికారతకు బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయించామన్న సీఎం.. మరో రూ.500 కోట్లు పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. 3, 4 ఏళ్లలో రూ.35 నుంచి 40 వేల కోట్లు ఖర్చుచేసే యోచన ఉందన్నారు. ఈ బడ్జెట్ ఎస్సీ ఉపప్రణాళికకు అదనమని ప్రకటించారు. ఎస్సీల సాధికారత సాధనకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందుకు అఖిలపక్ష నేతలంతా కలిసిరావాలని కోరారు.
అందుకు పాలకులే బాధ్యులవుతారు..
ఎస్సీ సాధికారత పథకాన్ని సంపూర్ణంగా విజయవంతం చేద్దామని సీఎం కేసీఆర్ విపక్షాలకు పిలుపునిచ్చారు. పైరవీలకు ఆస్కారం లేని, పారదర్శక విధానాన్ని అమలు పరుద్దామన్నారు. రాజకీయాలకు అతీతంగా సమష్టి కార్యాచరణ చేపట్టే బాధ్యత అందరం తీసుకుందామన్నారు. సమాజాన్ని ముందుకు నడిపించడంలో ప్రభుత్వాలది చంటి పిల్లను పోషించే పాత్రగా సీఎం అభివర్ణించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే రేపటి తరాలు నష్టపోతాయని, అందుకు పాలకులే బాధ్యులవుతారని సీఎం పేర్కొన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ ఊరు పోయినా.. సామాజికంగా, ఆర్థికంగా పీడిత వర్కాలు ఎవరంటే చెప్పే పేరు ఎస్సీ,ఎస్టీలే అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ బాధ పోవడానికి, వారు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి సర్కార్ కార్యాచరణ సిద్ధం చేస్తోందని తెలిపారు. దశలవారీగా ప్రణాళికలు రూపొందిస్తోందని చెప్పారు.
ఇదీ చదవండి: Etela: డబ్బులు తీసుకోండి.. మనస్సాక్షి ప్రకారం ఓటేయండి: ఈటల