తెలంగాణ రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో భారీగా మార్పులు జరిగేట్లు తాజా పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా ఏటా 17లక్షలకుపైగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అందులో దాదాపు నాలుగున్నర లక్షలు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు రెవెన్యూ శాఖ పరిధిలోకి వెళ్లుతుండడంతో...రిజిస్ట్రేషన్ల శాఖ పునర్ వ్యవస్థీకరణ తప్పనిసరి అవుతోంది.
కొత్తగా ఏర్పాటు చేయాలని...
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌లు ఎక్కువగా జరిగే 23 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను గుర్తించిన అధికారులు వాటిని పూర్తిగా ఎత్తివేసి... ఎక్కువ సంఖ్యలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు జరిగే ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అయితే... ఇప్పటి వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, వరంగల్ తదితర జిల్లాల్లోని 21 ప్రాంతాలల్లో కొత్తగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
పారదర్శకతకై...
ఆర్థిక లావాదేవీలతో సంబంధం ఉన్న శాఖలను పునర్ వ్యవస్థీకరణ చేసుకుంటూ.. వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య, ఎక్సైజ్ శాఖల ప్రక్షాళన పూర్తి చేసింది. తాజాగా రిజిస్ట్రేషన్ శాఖ వంతు వచ్చిందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ శాఖలోనూ పారదర్శకత తీసుకురావాలన్న కృత నిశ్చయంతో ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఇందుకు అవసరమైన సమాచారాన్ని రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి తెప్పించుకుంది.
ఎవరెవరున్నారు...
గడిచిన మూడు సంవత్సరాలకు చెంది.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా జరిగిన వ్యవసాయ, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల సంఖ్య, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది... ఒప్పంద ఉద్యోగులు ఎంతమంది... అవసరాలకు నియమించుకున్న తాత్కాలిక ఉద్యోగులు ఎంతమంది... సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న డాక్యుమెంట్ రైటర్లలల్లో ఎంత మంది లైసెన్స్ పొందిన వారు ఉన్నారు... లైసెన్స్ లేని వారెందరు... వారి విద్యార్హతలు ఏమిటనే వివరాలు కూడా తెప్పించుకుంది.
వారి పరిస్థితి ఏంటి?
ఇంత పెద్ద ఎత్తున వివరాలను తెప్పించుకోవడంతో సమూల మార్పులు, చేర్పులు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. డాక్యుమెంట్ రైటర్లతో సంబంధం లేకుండా ఒక్కో రకమైన రిజిస్ట్రేషన్లకు ఒక్కో రకమైన ఫార్మేట్‌లను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా సాధ్యమని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. భూములు, భవనాలు, వ్యాపార సముదాయాలు ఇలా కేటగిరీల వారీగా రిజిస్ట్రేషన్లకు అనువుగా అవసరమైన ఫార్మేట్లు తెస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విధానం అందుబాటులోకి తెస్తే... దీనిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వేలాది మంది డాక్యుమెంట్ రైటర్ల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది.
గడవు పొడిగించారు...
అటు రెవెన్యూ, ఇటు రిజిస్ట్రేషన్ల శాఖ ఒకేసారి రిజిస్ట్రేషన్లు ప్రారంభించేందుకు ప్రభుత్వ చర్యలు వేగవంతం అయ్యాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, భవనాలు విలువలను నిర్ధారించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇళ్లకు చెంది డోర్ నంబర్లు ఆధారంగా, భూములకు సంబంధించి సర్వేనంబర్లు ఆధారంగా ఆస్తుల విలువను నిర్ధారిస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ వద్ద ఇప్పటికే ఆస్తులకు చెందిన విలువల వివరాలు ఉండడంతో... ధరణి పోర్టల్‌లో విలువలను నమోదు చేసే కార్యక్రమాన్ని ఆ శాఖకే అప్పగించింది. ఈ నెల 5వ తేదీ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని గడువు విధించినప్పటికీ... వివిధ కారణాలతో అది సాధ్యం కాలేదు. దానిని ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించారు.
ఆదాయం తగ్గుతుంది...
కరోనా కట్టడిలో భాగంగా అమలు చేసిన లాక్‌డౌన్ కారణంగా యాభై రోజులపాటు రిజిస్ట్రేషన్లు కొనసాగలేదు. ఆ తరువాత రెవెన్యూ చట్టం రావడం, వ్యవసాయ రిజిస్ట్రేషన్లు.. రెవెన్యూ అధికారులకు అప్పగించాలనే అంశాల వల్ల గడిచిన 35 రోజులుగా రిజిస్ట్రేషన్ల శాఖ మూతపడింది. దీంతో రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం భారీగా పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఆర్థిక ఏడాదిలో దాదాపు 17లక్షలు మేర రిజిస్ట్రేషన్లు జరిగి... రూ.6,446 కోట్లు రాబడిరాగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో పదివేల కోట్లు రాబడిని లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఈ ఆర్థిక ఏడాది ఆరంభం నుంచి ఒకదాని తరువాత ఒకటి రిజిస్ట్రేషన్ శాఖకు ఎదురవుతున్న ఆటంకాల ప్రభావం ఆదాయంపై పడుతోంది. పదివేల కోట్లు రాబడిగా లక్ష్య నిర్దేశం చేసిన ప్రభుత్వం... రిజిస్ట్రేషన్‌ల శాఖలో చోటు చేసుకుంటున్న మార్పులు, చేర్పులు, కరోనా ప్రభావాలతో నాలుగో వంతు రాబడి.. తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.
అవినీతికి ఆస్కారం లేకుండా...
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు రెవెన్యూ శాఖకు, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు అన్నింటిని స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ చేసేట్లు నిర్ణయించింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్లను పూర్తిగా నిలుపుదల చేసిన ప్రభుత్వం... మండల రెవెన్యూ కార్యాలయాల్లో వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్లు నిర్వహించి... వెంటనే మ్యూటేషన్ పూర్తి చేసేట్లు ప్రభుత్వ చర్యలు ముమ్మరమయ్యాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు, రెవెన్యూ కార్యాలయాలకు నెట్‌వర్క్ అనుసంధానం చేసే కార్యక్రమం వేగవంతమైంది. రెండు శాఖల్లోనూ జరుగుతున్న సమూల మార్పులు, చేర్పులతో పూర్తి పారదర్శకత వస్తుందని, పౌరులకు మరింత మెరుగైన అవినీతికి ఆస్కారం లేని సేవలు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఇదీ చూడండి: సబ్ రిజిస్ట్రార్, రెవెన్యూ కార్యాలయాలకు నెట్‌వర్క్ అనుసంధానం వేగవంతం