Chandrababu Comments On CM Jagan: ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి ఆగిపోయి అవినీతి పెరిగిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కర్నూలు జిల్లా ఆదోనిలో రోడ్ షోలో జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన చంద్రబాబు.. ఇసుక, మద్యం, భూకబ్జాలు పెరిగాయని ధ్వజమెత్తారు. రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ దాడులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
అన్నింటిపై ఛార్జీల మోత మోగిస్తున్నారని.. ఆఖరికి చెత్తపైనా పన్ను వేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇసుక ఎక్కడా దొరికే పరిస్థితి లేదని.. ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. నాసిరకం మద్యం విక్రయిస్తూ.. పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూకబ్జాలు, ఇసుక, మద్యం దందాలు పెరిగిపోయాయని చంద్రబాబు దుయ్యబట్టారు.
ప్రజలకు తప్ప ఎవరికీ భయపడను: తనని భయపెట్టాలని చూస్తున్నారన్న బాబు.. ప్రజలకు తప్ప తాను ఎవరికీ భయపడనని తేల్చిచెప్పారు. పేదలకు ఉపయోగపడే అన్న క్యాంటీన్లు తీసేశారని దుయ్యబట్టారు. కొన్ని ఛానళ్ల ప్రసారాలు రాకుండా చేస్తున్నారని.. నచ్చిన ఛానళ్లను చూసే హక్కు మనకుందని తెలిపారు. ఏదైనా ఛానల్ ప్రసారాలు రాకపోతే గట్టిగా నిలదీయాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను నేర రాష్ట్రంగా తయారు చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో పెట్టుబడులు లేవని.. ఏపీ అంటేనే పెట్టుబడిదారులు భయపడే పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు. సంపద నాశనం చేసే పార్టీ వైసీపీ అయితే.. సంపద సృష్టించే పార్టీ టీడీపీ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: భవిష్యత్తులో మరో మహమ్మారి పొంచి ఉంది: డాక్టర్ కృష్ణ ఎల్ల
కాంక్రీట్ మిక్సర్, జేసీబీలతో పిండి కలిపి ప్రసాదం తయారీ.. అంతా టన్నుల్లోనే!