SANKRANTHI CELEBRATED IN NARAVARIPALLI: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భోగి పండగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. తెల్లవారుజామునే లేచి ఇళ్ల ముందు, వీధుల్లో పెద్ద ఎత్తున భోగి మంటలు వెలిగించి.. పాత వస్తువులను అందులో వేశారు. కీడు తొలగిపోవాలని కోరుకున్నారు. మంటల చుట్టూ తిరుగుతూ.. ఆటపాటలతో సందడి చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో నారా, నందమూరి కుటుంబసభ్యులు తమ స్వగ్రామం నారావారిపల్లెకి సంక్రాంతి పండగకు వచ్చి సందడి చేశారు. చంద్రబాబు నాయుడు ఇంటి ముందు భోగి మంట వేశారు. ఈ కార్యక్రమంలో ఇరు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు భోగి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలతో ముచ్చటించారు.
ఈ సందర్బంగా మాట్లాడిన చంద్రబాబు.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇటుక ఇటుక పేర్చి రాష్ట్రాభివృద్ధికి తాను కృషి చేస్తే... ప్రజావేదిక విధ్వంసంతో జగన్ పాలన ప్రారంభించారని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం లేకుండా పోయిందన్నారు. అందరం కలసి కట్టుగా పనిచేస్తే ఈసారి విజయం కచ్చితంగా సాధిస్తామని కార్యకర్తలకు సూచించారు.
"టీడీపీ అధికారంలోకి వచ్చాక నాలెడ్జ్ ఎకానమీకి ప్రాధాన్యత ఇచ్చాం. ఇటుకపై ఇటుక పేర్చి రాష్ట్రాభివృద్ధికి కృషి చేశా. ప్రజావేదిక విధ్వంసంతో జగన్ పాలన మొదలుపెట్టారు. ఉగ్రవాద తరహా విధ్వంసం సాగుతోంది. రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. ప్రజలపై పన్నులు, ఛార్జీల మోత మోగిస్తున్నారు. పిల్లల భవిష్యత్తు నాశనం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కందుకూరులో ప్రభుత్వం కుట్రచేసి తొక్కిసలాటకు కారణమైంది. గుంటూరు తొక్కిసలాటలోనూ కుట్ర ఉంది.. త్వరలో బయటపడుతుంది." -చంద్రబాబు
ఇంతవరకు నా సున్నితత్వం చూశారు.. ఇకపై కఠినత్వాన్ని చూస్తారని చంద్రబాబు అన్నారు. వడ్డీతో సహా అంతా తీర్చుకుంటామన్నారు. పోలీసులు ఆత్మవిమర్శ చేసుకుని విధులు నిర్వహిస్తే మంచిదని చంద్రబాబు తెలిపారు. పుంగనూరు కాదు 175 నియోజకవర్గాలు గెలవాలని చంద్రబాబు నాయకులు, కార్యకర్తలకు సూచించారు.
సినిమాల పండుగ : నారావారిపల్లెలో బాలకృష్ణ సందడి చేశారు. ఈ ఉదయం ఉదయపు నడక అనంతరం చంద్రబాబు నాయుడు ఇంటి ముందు వేసిన భోగి మంటలలో చలి కాచుకుని అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వీర సింహారెడ్డి సినిమా అన్ని రకాల ప్రేక్షకులు చూడదగ్గదని.. సంక్రాంతి పండగ అంటేనే సినిమాల పండగ అని ఆయన అన్నారు. నా ప్రేక్షక దేవుళ్లు, ఆత్మీయులు, అభిమానులు ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రాష్ట్రం బాగుపడాలని మంచి నాయకత్వం రావాలని ఆయన ఆకాంక్షించారు.
ఇవీ చదవండి