ఆనాడు పోతిరెడ్డిపాడును వైఎస్ఆర్ 44 వేల క్యూసెక్కులకు పెంచితే ఇప్పుడు ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి 80 వేల క్యూసెక్కులకు పెంచేందుకు యత్నిస్తున్నారని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మండిపడ్డారు. ప్రాజెక్టు పెంపుపై ఆనాడు అడ్డుకోని నాయకులు.. ఇవాళ గగ్గోలు పెడుతున్నారని ఆక్షేపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకూ ప్రాజెక్టును 80 వేల క్యూసెక్కులకు తీసుకుపోనివ్వరని ధీమా వ్యక్తం చేశారు.
1969 ఉద్యమం కూడా నీళ్లు-నిధుల కోసం జరిగిందని... తిరిగి తెలంగాణ మలిదశ ఉద్యమం సైతం నీళ్లు-నిధుల కోసమే కొనసాగిందన్నారు. ఇప్పటి వరకు 30 టీఎంసీల నీళ్లను దొంగచాటున ఏపీ తీసుకుపోయిందని తెలంగాణ అధికారులు చెప్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. 2004లో వైయస్ఆర్ హయాంలో మేం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ అప్పుడే తెలంగాణ కోసం పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుని వ్యతిరేకించామని స్పష్టం చేశారు.
విభజన చట్టం ప్రకారం ఇరు రాష్ట్రాల అంశాలు పూర్తిగా తేలనేలేదు
కృష్ణా బోర్డు ఉంది... అప్పీల్ అథారిటీ ఉంది... 2014 విభజన చట్టం అంశాలు ఇంకా పూర్తిగా తేలనేలేదని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో 203 జీవో తీసుకురావడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆనాడు పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు పైన ఒక్క మాట మాట్లాడని కొందరు నాయకులు ఇవాళ కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇద్దరు ఎంపీలు ఆనాడు పులిచింతలపై సర్వే చేయించారని.. ఈనాడు వ్యతిరేకిస్తున్నారని ఆయన ఆరోపించారు. కొందరు నేతలు అయితే ఏకంగా కాంట్రాక్టులు తీసుకొని ఆంధ్ర నేతలకు మద్దతు పలికారన్నారు.
జాతీయ పార్టీల ద్వంద వైఖరి...
జాతీయ పార్టీలు ద్వంద వైఖరిని అవలంబిస్తున్నాయని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో.. ఏపీ రాష్ట్రంలోని నేతలు ఒక విధంగా, తెలంగాణలోని అదే పార్టీలోని నేతలు మరో విధంగా మాట్లాడుతున్నారన్నారు. ఆనాటి కాంగ్రెస్ నేత మంత్రి.. ఇవాళ భాజపా నేత డీకే అరుణ హంద్రీనివాకు నీళ్లు వెళ్లినప్పుడు హారతులు పట్టారని ఆయన ఆరోపించారు. నాగార్జున సాగర్ ఇప్పటికి కరువుతో కొట్లాడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు చేపడితే.. మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో కొంత భాగం ఎడారిగా మారే అవకాశం ఉందన్నారు.
ఇవేం ధీక్షలు..నేనెప్పుడూ చూడలే..!
పోతిరెడ్డిపాడు సమస్య పరిష్కారానికి ఉపవాస దీక్షలు చేస్తే ఏం రాదని గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్, భాజపా హితబోధ చేశారు. రెండు గంటల ఉపవాస దీక్ష చేస్తే ఏం రాదని.. ఇప్పటి వరకు తాను అలాంటి దీక్షలు చూడలేదన్నారు. అందరం కలిసి ఏపీ ప్రభుత్వంతో పాటు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు జీవోను అడ్డుకుందామన్నారు. దీనికి రెండు జాతీయ పార్టీలు కలిసి రావాలన్నారు. ఏపీ ప్రభుత్వం 203జీవోను రద్దు చేసుకోవాలని ఆ రాష్ట్ర సీఎంకు అప్పీలు చేస్తున్నట్లు గుత్తా తెలిపారు.
తెలంగాణలోని జిల్లాలను ఎడారిలాగా మారిపోయే కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ పూనుకున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును 80వేల క్యూసెక్కులకు తీసుకుపోనివ్వరని ఆశిస్తున్నాను. - గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనమండలి ఛైర్మన్
ఇవీ చూడండి: తెల్లారిన బతుకులు..రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి