కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన గడువు ఈ నెల 31వ తేదీలోగా భారత ఆహార సంస్థకు రైసు మిల్లర్లు సీఎంఆర్ అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల సంస్థ ఆదేశించింది. ఖరీఫ్‌కు గడువు పొడిగించలేదని, కేవలం రబీకి మాత్రమే మార్చి 31 వరకు గడువు పొడిగించిన దృష్ట్యా.. భవిష్యత్తులో గడువు పెంచుతారనే నమ్మకం లేదని అన్నారు. ఇది దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా మిల్లర్ల నుంచి సీఎంఆర్ సేకరించాలని ఆ సంస్థ ఛైర్మన్ రవీందర్ సింగ్ పేర్కొన్నారు.
జిల్లా మేనజర్లతో సమావేశం: కేంద్రం నుంచి సహకారం లేకపోవడంతో పాటు జిల్లా అధికారుల నిర్లక్ష్యం, అలసత్వం వల్ల మిల్లర్ల నుంచి బియ్యం సేకరణలో జాప్యం జరుగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. పౌర సరఫరాల భవన్‌లో 33 జిల్లాల మేనేజర్లతో ఆయన సమీక్షించారు. సీఎంఆర్‌లో ఆలస్యం జరగడం వల్ల సంస్థపై వడ్డీ భారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు మన ముందు అతిపెద్ద టాస్క్ 2021-22 రబీ సంబంధించి 12 లక్షల 61 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్ల నుంచి రావాల్సి ఉందని ప్రస్తావించారు.
FCIకి ఎన్ని మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాలి: ఇందులో బాయిల్డ్ రైస్ 6.64 లక్షల మెట్రిక్ టన్నులు, ఎఫ్‌సీఐ రా రైస్ 4.51 లక్షల మెట్రిక్ టన్నులు, సీఎస్‌సీ రా రైస్ 1.46 లక్షలు కలిపి మొత్తం 11 లక్షల 15 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మార్చి 31వ తేదీలోగా ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి ఉందన్నారు. సమయం చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో రోజుకు 50 వేల మెట్రిక్ టన్నుల బియ్యం అప్పగిస్తేనే లక్ష్యం చేరుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో రా రైస్, బాయిల్డ్ రైస్ మిల్లులు ఒక షిఫ్ట్ ప్రకారం పని చేస్తే 45 వేల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లింగ్ చేయవచ్చు అని వివరించారు.
పర్యవేక్షణ లోపం స్ఫష్టంగా కనబడుతుంది: ఎఫ్‌సీఐకు రా రైస్ అప్పగించడంలో సమస్యలు ఉండవచ్చు. కానీ, బాయిల్డ్ రైస్ ఇవ్వడంలో ఇబ్బందులు ఏమిటి? ఎందుకు మిల్లర్లు ఇవ్వడం లేదు? రైస్ మిల్లర్లు బియ్యం ఇవ్వకపోతే మీరేం చేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనబడుతోందంటూ తీవ్రంగా తప్పుపట్టారు. సూర్యాపేటలో 95 వేల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కేవలం 31 వేలు మాత్రమే అప్పగించడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు.
ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూడండి: వచ్చే వారంలో వనపర్తి, సూర్యాపేట జిల్లా అధికారులకు ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తామన్నారు. ఎఫ్‌సీఐకి బియ్యం అప్పగించే విషయంలో ఏదైనా సమస్యలు ఎదురైతే మంత్రి గంగుల కమాలకర్, కమిషనర్‌తో పాటు తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా సరైన పద్ధతిలో పని చేయాలని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: