తెలంగాణ వచ్చిన ఏడేళ్లలో పోడు సాగుదారులకు ఏడుపే మిగిలిందని... హరితహారం వారి పాలిట ఉరిహారంగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి(chada venkat reddy) ఆరోపించారు. 2018 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ తానే స్వయంగా... పోడు సాగుదారుల సమస్యను పరిష్కరిస్తానన్న మాట ఇప్పటికీ అమలు కాలేదని ఎద్దేవా చేశారు. అటవీ అధికారులు, పోలీసుల మధ్య నలిగిపోతున్న పోడుసాగుదారులకు అండగా నిలిచేందుకు ... జల్-జమీన్-జంగల్ ఉద్యమానికి సీపీఐ శ్రీకారం చుట్టిందని చాడ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్‌లోని జోడేఘాట్ కుమ్రం భీమ్ స్థూపం నుంచి ఆగస్టు 4న సీపీఐ ‘పోడు యాత్ర(podu yatra)’ ప్రారంభిస్తోందని పేర్కొన్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్‌లోని మగ్దూంభవన్‌లో చాడ వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాష, రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, కార్యదర్శి వర్గ సభ్యులు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు.. ‘పోడు యాత్ర’(podu yatra) పోస్టర్ ఆవిష్కరించారు.
తరతరాలుగా ఇదే సమస్య
ఆగస్టు 4న జోడేఘాట్‌లో ప్రారంభమయ్యే పోడు యాత్ర 8వ తేదీన భద్రాచలంలో ముగుస్తుందని చాడ వెల్లడించారు. అడవిలో సాగు చేసుకునే అడవి బిడ్డలకు భూమిపై హక్కు కల్పిస్తూ... 2006లో కేంద్ర ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం తీసుకువచ్చిందని గుర్తు చేశారు. అయినప్పటికీ రాష్ట్రంలో తరతరాల నుంచి పోడు సాగు చేసుకుంటున్న... గిరిజన, ఎస్సీ, బీసీలకు హక్కు పత్రాలు ఇవ్వకపోవడం శోచనీయమని వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే అన్యాయం జరిగిందని... తెలంగాణ వచ్చాక పట్టాలు వస్తాయనుకుంటే చివరకు నిరాశే మిగిలిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ స్వయంగా తానే వచ్చి సమస్య పరిష్కరిస్తానని పలుమార్లు చెప్పారని... ఆ హామీ ఎప్పుడు అమలవుతుందని చాడ ప్రశ్నించారు.
ఇదీ చదవండి: REVANTH: సీఎం కేసీఆర్‌కు రేవంత్ లేఖ.. రుణమాఫీ నిధుల విడుదలకు డిమాండ్