Cereal Rich Food for Students in TS : రాష్ట్రంలో చిరుధాన్యలతో కూడిన పౌష్ఠికాహారాన్ని అందించేెందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. గతంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా మహిళలకు, చిన్నారులకు సరఫరా చేస్తుండగా.. ఇదేవిధంగా తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ, బీసీ, అల్ప సంఖ్యాక వర్గాల శాఖలు, వైద్య ఆరోగ్య శాఖ చిరుధాన్యాల ఆహారాన్ని అందించేందుకు ముందుకొచ్చింది.
నీతి ఆయోగ్ ప్రశంసలు : 2021 జులై నుంచి తెలంగాణలో గిరి పోషణ పథకం అమల్లోకి వచ్చింది. ఏటూరు నాగారం, భద్రాచలం, ఉట్నూరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థల పరిధిలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆయా ప్రాంతాల్లోని 3 ఏళ్ల నుంచి 5 సంవత్సరాల పిల్లలు, బాలింతలు, గర్భిణులు, కౌమార దశలో ఉన్న బాలికలకు చిరుధాన్యాల ఆహార పదార్థాల సరఫరా ప్రారంభించారు. టీఎస్ ఫుడ్స్ సంస్థ రైతుల నుంచి చిరుధాన్యాలను సేకరించి.. వివిధ ఆహార పదార్థాలను తయారు చేసి ఐటీడీఏలకు సరఫరా చేస్తోంది. వాటి పరిధిలోని అంగన్‌వాడీలతో పాటు గురుకులాలు, వసతి గృహాలు, పాఠశాలల్లో అందజేస్తున్నారు. గిరి పోషణతో మహిళలు, పిల్లల్లో రక్తహీనత సమస్య పరిష్కారమైందని నీతిఆయోగ్, మరిన్ని ప్రముఖ సంస్థలు ప్రశంసించాయి.
ఆసుపత్రిలోనూ పెట్టే ఆలోచనతో ప్రభుత్వం : ఈ విధంగానే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారంగా రాగి జావ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. వారంలో ఒక రోజు మధ్యాహ్న భోజనం సమయంలో విధిగా తృణ ధాన్యాల ఆహారం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఎస్సీ, బీసీ, మైనారిటీ గురుకుల విద్యాసంస్థలు సైతం చిరుధాన్యాల ఆహారంపై దృష్టి పెట్టాయి. వైద్య ఆరోగ్యశాఖ ఆసుపత్రిలో రోగులు, వారి సహాయకులకు అందించే ఆహారంలో వీటిని జోడించాలని ప్రభుత్వం భావిస్తుంది.
కేంద్రం మద్దతు ధర ప్రకటించాలి : ‘గిరిపోషణ’ ప్రారంభమయ్యాక రాష్ట్రంలో చిరుధాన్యాలకు డిమాండ్ ఎక్కువగా పెరిగింది. అందువల్ల జిల్లాలో రైతులు వీటిని అధికంగా సాగు చేస్తున్నారు. ప్రభుత్వ శాఖలు చిరుధాన్యాల పంపిణీపై దృష్టి పెట్టడం రైతులకు ఆశాజనకం కానుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 95 వేల ఎకరాల్లో చిరుధాన్యాలు పండిస్తుండగా.. ఇందులో 60 వేల ఎకరాల్లో జొన్నలు, 35 వేల ఎకరాల్లో రాగులు, కొర్రలు, అరికలు, మినుములు, సామలను రైతులు పండిస్తున్నారు. వచ్చే సంవత్సరం ఈ పంటల సాగు లక్ష్యాన్ని రెట్టింపు చేయాలని వ్యవసాయ శాఖ భావిస్తోంది. చిరుధాన్యాలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని, రేషన్ కార్డుదారులకు చౌకధర దుకాణాల ద్వారా పంపిణి చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు.
ఇవీ చదవండి: