హెచ్ఎండీఏ సమగ్ర అభివృద్ధి, వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపాలను సరిదిద్దాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి... ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. హెచ్ఎండీఏ పరిధిలోని గ్రామాల ప్రజలు, ముఖ్యంగా రైతుల సమస్యలను పరిష్కరించాలని.. అక్రమాలకు తావు లేకుండా క్రమపద్ధతిలో అభివృద్ధి జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌ను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పునః సమీక్షించాలని లేఖలో పేర్కొన్నారు. హెచ్‌ఎండీఏ, స్థానిక సంస్థల మధ్య సమన్వయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు స్థానిక సంస్థలతో కలిసి ఉమ్మడిగా కార్యాచరణ రూపొందించాలని కోరారు. నిర్మాణ అనుమతులకై తీసుకువచ్చిన డీపీయంఎస్ సమర్థవంతంగా అమలయ్యేట్లు చూడాలని అన్నారు.
ఘట్కేసర్, గౌడవెల్లి, నాగులపల్లి, శంషాబాద్‌ల వద్ద ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్లపై రైల్వే లైన్లు వచ్చిన ప్రదేశాల్లో బ్రిడ్జ్‌లు నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని రేడియల్ రోడ్లతో పాటు రాజేంద్రనగర్, శంషాబాద్, నార్సింగి, పటాన్చెరు, శంబీపూర్ ప్రాంతాల్లో సర్వీస్ రోడ్లను పూర్తిచేయాలని సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ఉన్న ప్రతి సూచికపై దూరాన్ని సైతం చూపించాలని కోరారు. ఔటర్ రింగ్ రోడ్డు డివైడర్లపై చెట్లు పెంచడం, పొదలను తొలగించడం సరైన పద్ధతిలో చేయాలని లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చూడండి: కరోనా కొత్త స్ట్రెయిన్ లక్షణాలేంటి?