Kishan reddy on hyderabad bastis: హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ మాత్రమే కాదని.. నగరంలో బస్తీలు కూడా ఉన్నాయన్న సంగతిని మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి హితవు పలికారు. బస్తీలు, కాలనీల్లో మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్ అంబర్‌పేట నియోజకవర్గం, బాగ్ అంబర్‌పేట్‌లో పలు బస్తీలు, కాలనీల్లో కిషన్ రెడ్డి పర్యటించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీకి నిధులు కేటాయించి నాలాల అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రి కోరారు. వేల కోట్లు అప్పులు తెచ్చి.. కమీషన్ల కోసం హైటెక్ సిటీలో రోడ్ల పేరిట కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. కమీషన్లు, లాభాలు వచ్చే ప్రాజెక్టులు తప్ప... మురికివాడలు, నాలాలు, బస్తీలు, మురుగునీటిపారుదల వ్యవస్థ పట్టింపులేదని కేంద్రమంత్రి ఆరోపించారు. ఇప్పటికైనా భాగ్యనగరంలోని మెయిన్ రోడ్లను దిగితే బస్తీ వాసుల సమస్యలు తెలుస్తాయని హితవు పలికారు.
'2014లో తెరాస అధికారంలోకి వచ్చాక జీహెచ్‌ఎంసీ డిపాజిట్లు రూ. 500 కోట్లు ఉండేవి. ఇప్పుడు వేల కోట్లు అప్పులు తెచ్చినా.. హైదరాబాద్ బస్తీల్లో అభివృద్ధి శూన్యం. కమీషన్ల కోసం హైటెక్ సిటీ రోడ్ల పేరిట కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారు. హైదరాబాద్ అంటే హైటెక్ సిటీనే కాదు. మెయిన్ రోడ్లు దిగితే బస్తీలు, కాలనీల్లో ఎన్నో సమస్యలు కనిపిస్తాయి. రాష్ట్రానికి హైదరాబాద్ నుంచే అధిక ఆదాయం వస్తుంది. 30 శాతం జనాభా నగరంలోనే ఉంటున్నారు. కానీ భాగ్యనగర అభివృద్ధికి మాత్రం నిధులు కేటాయించడం లేదు.' -కిషన్ రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి
ఇవీ చదవండి: అఖిలేశ్‌తో ముగిసిన కేసీఆర్ భేటీ.. రెండు గంటలకు పైగా సాగిన చర్చ..
ప్రశాంత్‌నీల్ మల్టీవర్స్.. 'కేజీఎఫ్ 2' సీక్వెల్స్‌గా 'సలార్', 'ఎన్టీఆర్ 31'?