కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించడం సాధ్యం కాదని సంకేతాలు పంపింది. జులైలో జరిగే ప్రత్యేక జీఎస్టీ మండలి సమావేశం ఈ విషయంపై స్పష్టత ఇచ్చే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్, మే నెలల్లో జీఎస్టీ రాబడులు సగం కూడా రాకపోవడం వల్ల కేంద్రం పరిహారం చెల్లింపు విషయంలో పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. రాబడులు లేనప్పుడు ఎక్కడ నుంచి తెచ్చి పరిహారం ఇవ్వాలని కేంద్రం రాష్ట్రాలను ప్రశ్నిస్తోంది. కేంద్రం నిర్ణయం వల్ల తెలంగాణకు రావాల్సిన మూడున్నర వేల కోట్లుకుపైగా పరిహారంపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి.
ఒకే దేశం, ఒకే పన్ను నినాదంతో 2017 జులైలో దేశ వ్యాప్తంగా వస్తు సేవల పన్ను జీఎస్టీని కేంద్రం అమలులోకి తెచ్చింది. అప్పట్లో పెట్రోలియం ఉత్పత్తులు, లిక్కర్, పొగాకు ఉత్పత్తులను రాష్ట్రాల పరిధిలో ఉంచి మిగిలిన అన్నింటిని జీఎస్టీ పరిధిలోకి తెచ్చింది. అయితే ఉన్నఫలంగా పన్నుల విధానంలో మార్పులు తెస్తే రాష్ట్రాలకు రాబడులు తగ్గుతాయని జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆందోళన వ్యక్తం చేశాయి. తగ్గిన పన్నులను ఐదేళ్లపాటు కేంద్రం తిరిగి ఇస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ఆ మేరకు జీఎస్టీ చట్టంలోనూ పొందుపరిచింది. ప్రతి ఏడాది అంతకు ముందు ఏడాదిలో వచ్చిన రాబడులపై 14శాతం అదనంగా ఆయా రాష్ట్రాల్లో పన్నులు వసూలు కాకపోతే ఆ లోటును పరిహారం రూపంలో కేంద్రం పూడ్చాల్సి ఉంది. గడిచిన మూడు సంవత్సరాలుగా కేంద్రం ఇదేవిధంగా తగ్గిన రాబడులను పరిహారం రూపంలో రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇస్తూ వచ్చింది.
కొవిడ్-19 ప్రభావంతో ఏప్రిల్, మే నెలల్లో ఆర్థిక వ్యవస్థ స్తంభించింది. దేశవ్యాప్తంగా రాబడులు పూర్తిగా పడిపోయాయి. ప్రతి నెల లక్ష కోట్లు అంతకు మించి జీఎస్టీ రాబడులు రావాల్సి ఉండగా ఈ రెండు నెలల్లో వచ్చిన రాబడులు చాలా తక్కువగా ఉన్నాయి. గత ఏడాది ఏప్రిల్ నెలలో లక్షా 13వేల కోట్లకుపైగా రాబడులు రాగా ఈ ఏడాది కరోనా వల్ల ఏప్రిల్ నెలలో కేవలం రూ.61,543 కోట్లు మాత్రమే జీఎస్టీ ఆదాయం వచ్చింది. గత ఏడాది మే నెలలో లక్ష కోట్లుకుపైగా మొత్తం రాబడులు రాగా ఈ ఏడాది మే నెలలో దాదాపు రూ.43వేల కోట్లు మాత్రమే వచ్చింది. ఇదే సమయంలో రాష్ట్రాలల్లో కూడా రాబడులు భారీగా పడిపోయాయి. అంతకు ముందు కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే నిర్దేశించిన బెంచ్ మార్కు కంటే తక్కువ రాబడులు వచ్చేవి. వాటికి మాత్రమే కేంద్రం పరిహారం చెల్లిస్తూ వచ్చింది. కరోనా ప్రభావంతో ఏ రాష్ట్రంలోనూ యాభై శాతానికి మించి రాబడులు రాలేదు. కొన్ని రాష్ట్రాల్లో యాభై శాతం కూడా రాలేదు. అటు కేంద్రానికి వచ్చే రాబడులు భారీగా పడిపోవడం, ఇటు అన్ని రాష్ట్రాల్లోనూ ముందు మాదిరి పన్నులు వసూళ్లు కాలేదు. దీంతో పరిహారం చెల్లించడం సాధ్యమయ్యేలా లేదని కేంద్రం రాష్ట్రాలకు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పరిహారం చెల్లించమని కేంద్రం అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ.. సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. జీఎస్టీ చట్టంలోనే పరిహారం ఇస్తామని పొందుపరచి ఉండడం వల్ల ఈ పరిస్థితి నుంచి ఎలా బయట పడాలన్న కోణంలో అలోచిస్తున్న కేంద్రం జులైలో నిర్వహించనున్న ప్రత్యేక జీఎస్టీ మండలి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెల రూ.2600కోట్లు బెంచ్ మార్కు రాబడి కంటే ఏ మాత్రం తగ్గినా కేంద్రం పరిహారం కింద రాష్ట్రానికి భర్తీ చేయాల్సి ఉంటుంది. గత ఏడాదిలో వసూలైన మొత్తం జీఎస్టీపై 14శాతం అదనంగా చేర్చి ఈ ఏడాది ప్రతి నెల రావాల్సిన రాబడి బెంచ్ మార్క్‌ను కేంద్రమే ఆయా రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు నిర్దేశిస్తుంది. ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కలిసి జీఎస్టీ రాబడుల కింద రూ.5200 కోట్లుకు తగ్గకుండా రావాల్సి ఉంది. కాని కొవిడ్ ప్రభావంతో వ్యాపార, వాణిజ్య సంస్థల కార్యకలాపాలు లేకపోవడం వల్ల జీఎస్టీ రాబడులు కూడా భారీగా పడిపోయాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది ఏప్రిల్, మే రెండు నెలల్లో కేవలం రూ.1437కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. అంటే బెంచ్ మార్కు కంటే రాబడి తగ్గింది. కాబట్టి కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ. 3,763 కోట్లు పరిహారం రావాల్సి ఉంది. అయితే తాజాగా కేంద్రం ఆలోచనలను బట్టి చూస్తే ఈ రెండు నెలలకు చెందిన పరిహారం వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.
ఇవీచూడండి: భాగ్యనగరంలో భారీ వర్షం... రహదారులన్నీ జలమయం