పౌరసేవల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచేలా భవిష్యత్తు టెక్నాలజీని వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజా పంపిణీ, భూముల రిజిస్ట్రేషన్లు, జీఎస్టీ, ఎక్సైజ్, ఇంధన, వ్యవసాయ విభాగాల్లో ఆయా సేవలను విస్తృతం చేయనుంది. రంగారెడ్డి జిల్లాలో బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఆధారిత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ విజయవంతం కావడంతో మిగతా విభాగాల్లో అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ సాంకేతికతకు జాతీయస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు పరిశోధనలు నిర్వహించేందుకు వీలుగా ‘జాతీయ వ్యూహ దార్శనిక పత్రాన్ని’ రూపొందించింది.
ప్రభుత్వ విభాగాల్లో అమలుచేస్తే ఎదురయ్యే సవాళ్లను అధిగమించడంతోపాటు.. ఈ రంగంలో మరిన్ని పరిశోధనలు నిర్వహించే బాధ్యతను హైదరాబాద్ ఐఐటీ, ఐడీఆర్‌బీటీ, ఐఐటీ కాన్పూర్, సెట్స్ చెన్నై తదితర విద్యా సంస్థలకు అప్పగించింది. కృత్రిమ మేధ(ఏఐ) తరహాలో బ్లాక్‌చైన్ టెక్నాలజీలోనూ ప్రభుత్వ వ్యూహం ఒకేలా ఉండాలని స్పష్టంచేసింది. ఏఐ, ఇతర ఆధునిక భవిష్యత్తు టెక్నాలజీలతో బ్లాక్‌చైన్‌ను అనుసంధానం చేయాల్సిన అవసరముందని, కొత్త పరిశోధనలతో సాంకేతిక విప్లవాన్ని సృష్టించడం ద్వారా అంతర్జాతీయంగా నాయకత్వం వహించవచ్చని కేంద్రం భావిస్తోంది.
పరిపాలనలో వికేంద్రీకరణ, పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంలో బ్లాక్‌చైన్ టెక్నాలజీ ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సాంకేతికతతో సమాచార భద్రతకు భరోసా లభిస్తుంది. విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలు, ఆస్తుల క్రయవిక్రయ దస్తావేజులు, ఒప్పందాలు సరైనవా? కావా? పరిశీలించి నిర్ధారిస్తుంది.
- నీతిఆయోగ్
రాష్ట్రంలో బ్లాక్‌చైన్ డిస్ట్రిక్
ఇప్పటికే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి భూదస్త్రాల నిర్వహణ, ఫార్మా ఉత్పత్తుల నమోదు, ఎరువుల సరఫరా, వివిధ పథకాల్లో రాయితీల పంపిణీ, విద్యార్హతల ధ్రువీకరణ తదితర అంశాల్లో ఈ సాంకేతికతతో పైలెట్ ప్రాజెక్టులను నీతిఆయోగ్ నిర్వహించింది. విద్యార్హత పత్రాలపై సీడాక్ అడ్వాన్స్ కంప్యూటింగ్ స్కూల్ ఇప్పటికే నిర్వహించిన పైలెట్ ప్రాజెక్టు విజయవంతమైంది. తెలంగాణలో‘ బ్లాక్‌చైన్ డిస్ట్రిక్’ ఏర్పాటులో సీడాక్ వ్యవస్థాపక సభ్యత్వంతో కొనసాగుతోంది.
జాతీయ విధానానికి ఇవీ సూచనలు
- జాతీయ బ్లాక్‌చైన్ విధానం రూపకల్పనలో బహుళ సంస్థలకు భాగస్వామ్యం కల్పించాలి. విధానంలో యాప్‌ల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు-సేవలు, ఐపీ సృష్టికర్తలకు వేర్వేరు బాధ్యతలు అప్పగించి విధివిధానాలు రూపొందించాలి. ఈ సేవల్లోకి కొత్త ఆలోచనలతో వస్తున్న అంకుర(స్టార్టప్స్) సంస్థలను, ఈ సాంకేతికత వినియోగ పరిశ్రమలను అనుసంధానించాలి.
- ప్రభుత్వ సేవల్లో ఈ సాంకేతికతను వినియోగించే సమయంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి ముందుకెళ్లాలి. నమ్మకమైన ‘ప్రజా డిజిటల్ వేదిక’ తయారీకి లోతైన పరిశోధనలు జరగాలి.
- దేశీయ అవసరాల కోసం స్వదేశీ బ్లాక్‌చైన్ సాంకేతిక వేదిక ఏర్పాటుచేయాలి. వివిధ సాంకేతికతలతో కూడిన అప్లికేషన్లను దీనితో అనుసంధానించాలి. సేవా హోదానూ కల్పించాలి.
- ఈ సాంకేతికతను వినియోగించేందుకు ఆసక్తి చూపిస్తున్న ప్రభుత్వ విభాగాలకు అవసరమైన సేవలు అందించే కన్సల్టెన్సీలను సమకూర్చాలి.
- దీని వినియోగాన్ని ప్రోత్సహించేందుకు స్వల్పకాల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. ఆన్లైన్లో శిక్షణ ఇచ్చే యాప్‌లనూ అభివృద్ధి చేయాలి. ఆరోగ్య, వ్యవసాయం, ఇంధన ఇతర శాఖల్లో సమాచార భద్రత, మెరుగైన సేవల కోసం బ్లాక్‌చైన్ ఆధారిత డిజిటల్ వేదికలను సిద్ధంచేయాలి.
ఇదీ చదవండి: తమిళ ప్రజలు ఆదరించనందుకు బాధపడ్డా: తమిళి సై