Center issues directives on sun severity: దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు.. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ లేఖ రాసింది. మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా ప్రతి రోజు ఎండ తీవ్రతకు సంబంధించిన సర్వైలెన్స్ చేయనున్నట్టు స్పష్టం చేసింది.
వడదెబ్బ బాధితుల వివరాలు నమోదు చెయ్యాలి: నిత్యం ఉష్ణోగ్రత తీవ్రత, వాతావరణ మార్పులకు సంబంధించిన వివరాలను అందించనున్నట్టు తెలిపింది. ఫలితంగా రాష్ట్రాల్లో పట్టణ, జిల్లా స్థాయిలోని వడదెబ్బ సమస్యలను అరికట్టేలా చర్యలు తీసుకునేందుకు వీలవుతుందని పేర్కొంది. ఇక రాష్ట్రాలు సైతం తప్పక వడదెబ్బ బాధితుల వివరాలను కేంద్ర ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ ఫాం ఐహెచ్‌ఐపీలో పొందుపరచాలని కోరింది.
ఆరోగ్య కేంద్రాల్లో తగిన సౌకర్యాలు ఉండాలి: వేడి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ బాధితుల సంఖ్య పెరిగేందుకు అవకాశం ఉందని చెప్పింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేదుకు అన్ని ఆరోగ్య కేంద్రాల్లో సరైన మొత్తంలో మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఐవీ ఫ్లూయిడ్లు, ఐస్ ప్యాక్‌లు అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపింది. ప్రతి ఒక్కరికి ఎండ తీవ్రతపై అవగాహన ఉండేందుకు తగిన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది. ఉష్ణోగ్రత పెరగితే ప్రజలు పడే ఇబ్బందులను వివరించింది.
అవసరమైతే తప్ప మధ్యహ్నం సమయంలో బయటకి రావద్దు: వేసవిలో ఎండతీవ్రత వల్ల అనారోగ్యం బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత ప్రచారం కల్పించాలని లేఖలో పేర్కొంది. వేసవిలో నీటిని ఎక్కువగా తీసుకోవటంతో పాటు.. చల్లని ప్రదేశాల్లో ఉండాలని ప్రజలకు సూచించింది. జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చల్లటి నీటి సదుపాయం కల్పించాలని తెలిపింది. ముఖ్యంగా అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న 12 నుంచి 3 గంటల లోపు ఇళ్ల నుంచి బయటకు రావద్దని వెల్లడించింది. చిన్నపిల్లలను మధ్యాహ్నం బయటకి రాకుండా ఉండేలా వారి తల్లిదండ్రులకు తగిన సూచనలు ఇవ్వాలని చెప్పింది. వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కవగా ఉంటుందని అందువల్ల ఇప్పటి నుంచే సరైన చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
ఇవీ చదవండి: